దమ్ముంటే చర్చకు రా.. ఎర్రబెల్లికి TRS ఎమ్మెల్యే సవాల్

by Disha Web |
దమ్ముంటే చర్చకు రా.. ఎర్రబెల్లికి TRS ఎమ్మెల్యే సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార టీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్‌కు ఉమ్మడి వరంగల్ వర్గ పోరు తలనొప్పిగా మారిపోయింది. కలిసి నడవాల్సిన నేతల మధ్య సఖ్యత కొరవడటంతో కారు స్పీడు రోజురోజుకూ తగ్గుతోందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పడిన ముసలం టీఆర్ఎస్ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారు దిగి వేరే పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరగడంతో ఒక్కసారిగా రాజకీయ అలజడి రేగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నేరేందర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో పాటు ఆయన సోదరుడు ప్రదీప్ రావుతో అస్సలు పొసగడం లేదనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. వీరి మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో కిందిస్థాయి క్యాడర్ పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతోందని ఈ పరిణామంతో పార్టీకి లాభం కంటే డ్యామేజే ఎక్కువ అనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

పార్టీని మోసం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు:

ప్రదీప్ రావు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే నన్నపనేనని నరేందర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 50వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బర్త్ డే కార్యక్రమానికి హాజరైన నన్నపనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ప్రదీప్ రావును ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. దమ్ముంటే వరంగల్ అభివృద్ధి మీద చర్చకు రావాలని పార్టీని మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తాను కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని, 1994 నుండి రాజకీయ ప్రజాజీవితంలో కొనసాగుతున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగేలా చూసే వారిని వదిలేదే లేదని హెచ్చరించారు. ప్రదీప్ రావు పార్టీని వీడుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన్ను పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం చేసింది. ప్రదీప్ రావుతో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారే విషయంలో తొందర పడవద్దని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నన్నపనేననే చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఉద్యమ కాలం నుంచి పార్టీకోసం నిలబడ్డామని ఇప్పుడు పార్టీని మోసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed