- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇళ్లల్లో దొంగిలించిన సొమ్ముతో ఆన్‌లైన్ షాపింగ్.. అడ్డంగా దొరికిపోయిన మైనర్ బాలురు!
వయసు చూస్తే మైనర్లు.. కానీ వారి ప్లాన్‌లు చూస్తే ముదురు దొంగలు కూడా ముక్కున వేలేసు కోవాల్సిందే.

దిశ,తాడ్వాయి: వయసు చూస్తే మైనర్లు.. కానీ వారి ప్లాన్‌లు చూస్తే ముదురు దొంగలు కూడా ముక్కున వేలేసు కోవాల్సిందే. సినిమాల ప్రభావం, తల్లిదండ్రుల అతి గారాబంతో దారి తప్పిన ఇద్దరు మైనర్ బాలురు చివరకు పోలీసులకు చిక్కి జువైనల్ హోమ్‌కు చేరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో జరిగిన ఈ విచిత్ర దొంగతనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం దేవాయిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ రాత్రి వేళ ఇంటి బయట నిద్రించింది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు మైనర్ బాలురు పక్కా స్కెచ్ వేశారు. ఆమె గాఢ నిద్రలో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా తల కింద ఉన్న దిండు సందులోంచి ఇంటి తాళం చెవిని నొక్కేశారు.
ఆ తాళంతో లోపలికి వెళ్లి ఇంట్లోని పెట్టెను ఎత్తుకొచ్చారు. అయితే, దొంగతనం పూర్తి చేశాక.. ఏమాత్రం అనుమానం రావద్దని తాళం చెవిని తిరిగి యథావిధిగా దిండు కింద పెట్టే ప్రయత్నంలో సదరు మహిళకు బాలుర చేయి తగిలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ఆమె దొంగ.. దొంగ.. అని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొన్నారు. దీంతో ఆ మైనర్ బాలుర దొంగతనం గుట్టు రట్టయింది. వెంటనే స్థానికులు రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం అందించారు.
మీషోలో ఆన్‌లైన్ జల్సాలు..
రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మైనర్లు చేరో స్మార్ట్ ఫోన్ వాడుతూ, దొంగిలించిన డబ్బులతో మీషో వంటి ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో ఆర్డర్లు బుక్ చేసుకుని జల్సాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి.. చివరకు ఇళ్లలోకి చొరబడే స్థాయికి దిగజారారని పోలీసులు వెల్లడించారు.
పోలీస్ కారులోంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం..
సోమవారం విచారణ పూర్తి చేసిన పోలీసులు నిందితుల నుంచి 15 వేలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలిస్తుండగా.. ఆ మైనర్లు సినిమా స్టైల్‌లో పోలీసులు తీసుకెళ్తున్న కారులోంచి తప్పించుకునే ప్రయత్నం చేశారాని పోలీసులు తెలిపారు.ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు వారిని పట్టుకుని, నిజామాబాద్‌లోని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి హోమ్‌కు తరలించారు.
అతి గారాబమే కొంపముంచింది: ఎస్సై నరేష్
పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ఈ పరిస్థితికి కారణమని తాడ్వాయి ఎస్సై నరేష్ పేర్కొన్నారు. చిన్నప్పుడే పిల్లల తప్పులను మందలించకపోతే వారు పెద్ద నేరస్థులుగా మారే ప్రమాదం ఉందన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఇంటికి తాళం వేసాము కదా అనే నమ్మకంతో డాబా పైనో, ఆరుబయటనో పడుకుంటే తాళాలతో పాటు విలువైన సొమ్ము దొంగల పాలవడం ఖాయమన్నారు. అంతా మనవాళ్లే అని ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల గురించి ఇతరులకు చెప్పడం దొంగలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతుందని హెచ్చరించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంటి పక్క వారికి చెప్పడంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని ఎస్సై నరేష్ కోరారు.






