మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పరిశ్రమల స్థాపన: మంత్రి కేటీఆర్

by Vinod kumar |
మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పరిశ్రమల స్థాపన: మంత్రి కేటీఆర్
X

దిశ, మహేశ్వరం: పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, టీపాస్ ఐపాస్ ద్వారా ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా వ్యాపారవేత్తలు నేరుగా పరిశ్రమలను స్థాపించుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసితండాలో విప్రో కన్స్యూమర్ కంపెనీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యాపారవేత్తల చూపు తెలంగాణ వైపు మళ్ళిందని, రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విప్రో కంపెనీలో ఉత్పత్తి అయ్యే సబ్బులు కాలుష్యం లేకుండా ఉత్పత్తి చేస్తున్నారన్నారు.


కంపెనీలలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విప్రో కంపెనీ 30 ఎకరాలలో రూ.300 కోట్ల పెట్టుబడితో స్థానిక యువతకు ప్రత్యక్షంగా 900 ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలు మహేశ్వరం నియోజకవర్గానికి రావడం వల్ల మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు మారాయన్నారు. విప్రో కంపెనీ లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, విప్రో గ్రూప్ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, సీఈవో శ్రీ వినీత్ అగర్వాల్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంద్య నాయక్, కేసి తండా సర్పంచ్ మోతీలాల్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story