పెట్టుబడులకు ముందుకు రావాలి.. ప్రవాస భారతీయులకు కేటీఆర్ ఆహ్వానం

by Disha Web Desk 2 |
పెట్టుబడులకు ముందుకు రావాలి.. ప్రవాస భారతీయులకు కేటీఆర్ ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రోత్ ఇన్ డిస్పర్షన్ విధానాన్ని అద్భుతంగా రూపకల్పన చేశామన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీసర్వ్ అలయన్స్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన ఐటీ ఎకోసిస్టమ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర మరియు తూర్పు భాగాలలో ఐటీ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ దార్శనికతతో అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందన్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలు అని, ఏడేళ్లలో 130శాతం పెరిగి 2 లక్షల 78 వేల రూపాయలకు చేరుకుంది. జీఎస్‌డీపీ 4.9 లక్షల కోట్ల రూపాయలని, ప్రస్తుతం 11.54 లక్షల కోట్ల రూపాయలు అని వివరించారు. నాలుగేళ్లలోపే కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాష్ట్రానికి మద్దతు ఇవ్వలేదన్నారు. భారత ప్రభుత్వ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) అవార్డులలో, దేశవ్యాప్తంగా మొదటి పది గ్రామాలలో ఏడు గ్రామాలు తెలంగాణకు చెందినవని, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రవాస సభ్యులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


న్యూయార్క్‌లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్

తెలంగాణ మంత్రిగా ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన కేటీఆర్, తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి మరియు ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బిజీ షెడ్యూల్ మధ్యలో ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్‌కి వెళ్లారు. విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన చికెన్ రైస్‌ని కొని తిన్నారు. ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు.


Next Story