ఇదేం ఫీజుల దోపిడీ.. యాజమాన్యంపై తిరగబడిన వైద్య విద్యార్థులు

by Dishafeatures2 |
ఇదేం ఫీజుల దోపిడీ.. యాజమాన్యంపై తిరగబడిన వైద్య విద్యార్థులు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓ వైపు కళాశాల అనుమతి రద్దు కావడంతో మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు ఎటూ తేలలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రలు తీవ్ర ఆందోళన చెందుతుండగానే ఫీజుల పేరిట యాజమాన్యం ఒత్తిడి చేయడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్​ఆర్ విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఏ మాత్రం ఆలస్యమైనా ఫైన్ల రూపంలో వేలు వసూలు చేయడంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫస్ట్, సెకండ్​, థర్డ్ ఇయర్​కు చెందిన దాదాపు 350 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటే బైఠాయించారు. ఫీజులు చెల్లించడంలో ఆలస్యం పేరిట ఇప్పటికే ఒక్కో విద్యార్థి నుంచి మూడు లక్షల రూపాయలు అదనంగా వసూలు చేశారని విద్యార్థులు చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతున్నారని, తల్లిదండ్రలు వచ్చి అడిగితే అసలు పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఇయర్​పరీక్ష రాయాలన్నా ఇప్పుడే మూడో సంవత్సరం ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పారు. పేరెంట్స్‌ను పురుగుల్లా చూస్తూ ఏది అడిగినా కసిరించుకుని తిరిగి పంపిస్తున్నారంటూ పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

తమ భవిష్యత్తుపై భరోసా ఏది..?

ఈ ఏడాది ఎంఎన్​ఆర్​ మొదటి సంవత్సరం అనుమతిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అనుమతి రద్దుతో అంతకుముందే ఫస్ట్ ఇయర్​లో చేరిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫీజులు చెల్లించామని, ఇప్పుడు మరింత ఫీజు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో అనుమతి రద్దయిన నేపథ్యంలో మరో కళాశాలలో

చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఇక్కడ కళాశాల యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పడం లేదంటున్నారు. ఇదే కళాశాలలో ఉంటామా..? మరో కళాశాలకు మారుతామా..? తమకు అర్థం కావడం లేదు. మా భయంతో మేముంటే ఫీజులు ఇస్తారా..? ఇవ్వరా..? అంటూ యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తును తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని, తమ తల్లిదండ్రులు ఇండ్ల వద్ద నిద్ర పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంత బాధ ఉంటే యాజమాన్యం అవేవి పట్టించుకోకుండా డబ్బులు, డబ్బులు అంటూ వేధిస్తుందంటున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతో పాటు ఫైన్ల పేరుతో కూడా లక్షల్లోనే దండుకుంటున్నదని మండి పడ్డారు.

150 మంది ఒక్క డెడ్​బాడీ కూడా లేదు..

నిబంధనల ప్రకారం ప్రతి 25 మంది వైద్య విద్యార్థులకు ఒక డెడ్​బాడీ ఉండాలి. ఎంఎన్​ఆర్​లో మాత్రం 150 మంది విద్యార్థులకు కూడా ఒక డెడ్​బాడీ లేదని విద్యార్థులు చెబుతున్నారు. డెడ్​బాడీ లేకుండానే ఎలా ప్రాక్టికల్స్ చేస్తామని ప్రశ్నించారు. వసతుల విషయంలో కూడా యాజమాన్యం పట్టించుకోదని, ఇష్టముంటే రావచ్చు, లేదంటే వెళ్లిపోండి అనే తీరుగా మాట్లాడుతారని చెప్పారు. ఎన్ని ఆందోళనలు చేసుకున్నా తమ కళాశాలకు ఏం కాదని యాజమాన్యం ధీమాగా ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తక్షణమే కళాశాలలో ఫీజులు, వసతులపై సమగ్ర విచారణ జరిపించాలని, మొదటి ఏడాది విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా ఇవ్వాలని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎంఎన్​ఆర్ ​కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ ​చేశారు.



Next Story

Most Viewed