మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. రెండు కిలో మీటర్ల దూరం వినపడేలా స్పీకర్లు

by Disha Web Desk 4 |
మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. రెండు కిలో మీటర్ల దూరం వినపడేలా స్పీకర్లు
X

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది కూర్చునేలా 4 లక్షల చదరపు అడుగుల్లో రెయిన్ ప్రూప్ టెంట్లను వేస్తున్నారు. ఇందుకోసం 10 భారీ జర్మన్ టెంట్లను తెప్పించారు. సంకల్ప సభలో ప్రధానమంత్రి అశీనులయ్యే సభతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలకు సంబంధించిన మరో రెండు వేదికలను కూడా పూర్తి చేస్తున్నారు. విజయ సంకల్ప సభ కోసం 100 తాత్కాలిక ఏసీలను వినియోగిస్తున్నారు. విద్యుత్ సమస్య తలెత్తితే ప్రత్యామ్నయంగా 50 జనరేటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. సభతోపాటు పరిసర ప్రాంతాలలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 30 ఎల్ ఈడీ స్క్రీన్లను అమర్చి ప్రజలు ఎక్కడ నుంచైనా ప్రముఖలు చేసే ప్రసంగాలను వినేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే మైదానంలో ఉన్నవారితో పాటు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం ప్రముఖుల ప్రసంగాలు వినిపించేలా స్పీకర్లను అమర్చుతున్నట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ సభ్యుడు, ఆర్కే ఈవెంట్ అధినేత జె.రామక్రిష్ణ వెల్లడించారు.

సహాయ నిరాకరణ

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న విజయ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ పాటిస్తుంది. పరేడ్ మైదానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, పోలీస్ బలగాల వినియోగానికి కనీసం మొబైల్ టాయిలెట్లను కూడా ఇవ్వడం లేదు. పరేడ్ మైదానంతో పాటు పరిసర ప్రాంతాలలో రోడ్లు, విద్యుత్ మరమ్మత్తులు వంటివి చేపట్టడం లేదు. తాగునీటి సరఫరా కూడా చేపట్టడం లేదని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి పర్యవేక్షణలో బోర్డు అధికార యంత్రాంగం మాత్రమే ఈ పనులన్నీ చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీని పలు విషయాలలో సహకరించాలని కోరినా.. పట్టించుకోవడంలేదని కంటోన్మెంట్ బోర్డు కు చెందిన ఓ అధికారి వాపోయారు.

బీజేపీ ప్లెక్సీలు చింపడం

పరేడ్ మైదానం వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ ప్లెక్సీలను శుక్రవారం చింపివేయడం కలకలం సృష్టించింది. ప్రధానితో సహా వీవీఐపీలు వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఓ వ్యక్తి చింపివేస్తుండడంతో గమనించిన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. అతన్ని పట్టుకొని ప్రశ్నించగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి రూ.500 ఇచ్చి ఆ నాలుగు ప్లెక్సీలను చింపి వేయాలని కోరినట్లు పట్టుబడ్డ వ్యక్తి చెప్పడంతో బీజేపీ నాయకులు ఖంగుతిన్నారు. ఇదంతా టీఆర్ఎస్ నాయకుల పనే కావచ్చని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.


Next Story

Most Viewed