Manda Krishna Madiga: గోల్కొండ కోటలో జెండా ఎగరేయడానికి కారణమిదే.. మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Manda Krishna Madiga: గోల్కొండ కోటలో జెండా ఎగరేయడానికి కారణమిదే.. మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలించే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబేద్కర్​జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్​రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని, సీఎం ఈ విషయం మరిచిపోవద్దని సూచించారు. తెలంగాణలో దళితులను మోసం చేసే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్​విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా కేసీఆర్​రాలేదంటే దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ నర్సింహారవు, బాపూఘాట్‌కి వెళ్లి గాంధీజీకి నివాళులర్పించే ముఖ్యమంత్రి అంబేద్కర్‌ను మాత్రం ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఇది అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

సెక్రటేరియట్ కట్టడానికి, యాదాద్రి నిర్మాణానికి డబ్బులుంటాయి.. కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా నేటికీ పురోగతి లేకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ రాష్ట్రంగా భావించడం లేదని, రాజ్యంగా భావించి తను రాజు అనుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. అందుకే పరేడ్ గ్రౌండ్‌లో కాకుండా గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తున్నాడని చురకలంటించారు. గవర్నర్‌ను కూడా విస్మరించిన చరిత్ర ముఖ్యమంత్రికే దక్కిందని మందకృష్ణ ఫైరయ్యారు. కేవలం 1 శాతం కూడా లేని వెలుమలు సీఎం వెంట నలుగురున్నారని, కానీ 52 శాతం ఉన్న బలహీన వర్గాలకు మాత్రం ఆయన తీరని అన్యాయం చేశారని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన ఈటలను కూడా పార్టీ నుంచి తప్పించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్ర కులాల పేదలకు 2 శాతం రిజర్వేషన్లు ఇస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అతి తక్కువ అగ్ర కులాలున్న వారికి అధికంగా రిజర్వేషన్లు ఇచ్చి బలహీన వర్గాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేట్​రంగాలను కేంద్రం ప్రోత్సహించడం మానుకోవాలి మంద కృష్ణ సూచనలు చేశారు.

Next Story

Most Viewed