టీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్థం చెప్పిన మధు యాష్కీ గౌడ్

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్థం చెప్పిన మధు యాష్కీ గౌడ్
X

దిశ, నారాయణపేట: భాష, మతపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజీపీ, అమరుల త్యాగాలతో గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీలపై ప్రజా వ్యతిరేకత మొదలైందని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలను ప్రజలు బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ నరేష్ గౌడ్ వివాహనికి హాజరైన ఆయన.. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, రామజన్మ భూమి లాంటి అంశాలను తెరపైకి తెచ్చి అధికారంలోకి వచ్చిన 8ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై కొవిడ్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు సరైన వైద్యం అందించని క్రమంలో బీజీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. మూడోసారి గెలవడం కష్టమని గ్రహించి యూపీఏ ప్రభుత్వం స్కాములు జరిగినవని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 8 ఏళ్లలో ఒక్కటి కూడా నిరూపణ చేయని బీజేపీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ్ ఏక్తా జోడో అంటూ పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించగానే రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల్లో టీఆర్ఎస్ కాస్త తెలంగాణ రాబందులు సమితి అయ్యిందన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానని దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నట్లే పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రజలు ఎంపీగా ఎన్నికోవడం వల్లనే తెలంగాణ బిల్లులో పాల్గొనే అవకాశం కేసీఆర్‌కు కల్గిందన్నారు. పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు పేరుతో కల్లును నిషేధించిన ముఖ్యమంత్రి నేడు ఎరువులు, విత్తనాలు అన్నింట్లో కల్తీ జరుగుతున్నా పట్టించుకోకుండా తను తన కుటుంబం బాగుపడుతూ వేలాది కోట్ల రూపాయలు ఆర్జించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మత్తుకు బానిసలుగా మార్చుతున్నాడని, ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ 870 కోట్ల రూపాయల పార్టీ ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయో సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ ఆయన బీజేపీ, టీఆర్ఎస్ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో 50 శాతం బలహీన వర్గాలకు పెద్దపీఠ వేస్తుందన్నారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ మనుగడ కోసం ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన పాలమూరు జిల్లా బిడ్డలు భవిష్యత్తు తరాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సారధ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళిత, గిరిజనులు బలహీన వర్గాలకు మేలు జరిగే విధానాలను అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిట్టెం అభిజయ్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ నాయకులు కాటం ప్రదీప్ గౌడ్, పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు జి.సుధాకర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండి.గౌస్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు ఎండి సలీం, సరితా సతీష్ గౌడ్,ధన్వాడ మండల అధ్యక్షుడు నరహరి, అఖిల్, రవి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed