వదలని వాన.. నెలన్నరగా నీళ్లలోనే పంటలు.. ఆరని భూములు

by Dishanational1 |
వదలని వాన.. నెలన్నరగా నీళ్లలోనే పంటలు.. ఆరని భూములు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వర్షాలు వదలటం లేదు.. నెలన్నరగా జడివాన వీడటం లేదు.. నిత్యం వానలు పడుతుండటంతో.. పంటలు నీళ్లలోనే ఉంటున్నాయి.. భూములు అసలే ఆరటం లేదు.. దీంతో పంటల ఎదుగుదల అంతగా లేకపోగా.. కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి.. ఫలితంగా అన్నదాతకు ఆర్థికంగా భారంగా మారుతోంది.. అసలు పంటలు పండుతాయో.. లేదోననే బెంగ పట్టుకుంది.. ఉమ్మడి జిల్లాలో సోయాబిన్, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతినగా.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారంపై ప్రభుత్వం తమకేం పట్టనట్లుగా ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ సారి పెట్టుబడులు పెరిగి.. దిగుబడులు తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.. !

ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని వరుణుడు ఏడిపిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా నిత్యం వర్షాలు కురుస్తుండటంతో.. అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయాబిన్, పప్పుదినుసులు పండిస్తుండగా.. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న, పసుపు లాంటి పంటలు కూడా పండిస్తున్నారు. ఇక మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఒక వరి పంటకు మినహా.. మిగతా పంటలకు తీవ్ర నష్టమే కలిగిస్తున్నాయి. అన్ని రకాల పంటలు నీటిలో ఉండగా.. అసలు భూములు ఆరటం లేదు. దీంతో కలుపు తీసి.. ఎరువులు వేసే పరిస్థితి లేకుండా పోయింది. కీటకాలు ఆశించటంతో స్ప్రే మందులు కూడా పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలించటం లేదు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల వరకు పత్తిని సాగు చేయగా.. గత నెలన్నర రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పత్తి పంట ఎదగకపోగా.. కలుపు మొక్కలతో నిండిపోతున్నాయి. అరకకొట్టేందుకు, మనుషులతో గడ్డిని తొలగించేందుకు భూములు ఆరటం లేదు. చాలా చోట్ల పంటలు నీటిలోనే తేలియాడుతున్నాయి. ఇక గడ్డిని తొలగించి స్ప్రే చేయటం, ఎరువులు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో పంటల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. మొక్కజొన్న పంట రంగు మారి గడ్డితో నిండిపోతున్నాయి. సోయాబిన్, పప్పుధాన్యాలకు సంబంధించి.. నీరు నిలిచే భూముల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎత్తుగా ఉన్న భూముల్లో నుంచి మాత్రమే నీరు బయటకు వెళ్తోంది. వరి మాత్రమే ఈ వర్షాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి.

ఈ ఏడాది రైతులకు పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది. గడ్డి, క్రిమిసంహారక మందులు కొట్టినా.. ఎరువులు వేసినా.. పంటలు ఆశించిన మేర పెరగటం లేదు. ఇప్పటికే రైతులకు పెట్టుబడి వ్యయం రెట్టింపుకాగా.. పంటల ఎదుగుదల మాత్రం సరిగా లేదు. దీంతో దిగుబడి కూడా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. రైతులకు అప్పులు పెరగటంతో.. ఎలా తీర్చాలోననే బెంగ పట్టుకుంటోంది. కడెం ప్రాజెక్టు వల్ల చాలా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా, కడెం, స్వర్ణ నదీ పరివాహక ప్రాంతాల్లోని భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేసి పంటలు కనిపించకుండా పోయాయి. చెరువులు తెగిపోవటంతో పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ, ఎడతెగని వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు నష్ట పరిహారం విషయంలో ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అసలు సర్వే కూడా సరిగా చేయటం లేదు. ఏదో తూతూమంత్రంగా కాగితాల్లో గణాంకాలు రాసి.. పంపించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విషయంలో స్పష్టత, ప్రకటన లేదు.

బండి సంజయ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ



Next Story

Most Viewed