రూ. లక్ష కడితే కోదాడ మున్సిపాలిటీలో జాబిస్తరంట..?

by Disha Web |
రూ. లక్ష కడితే కోదాడ మున్సిపాలిటీలో జాబిస్తరంట..?
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో కామాటీ పోస్ట్ ధర రూ. లక్షల్లో పలుకుతోంది. 18 నెలలుగా సాగుతున్న శానిటేషన్ వర్కర్ల నియామక వివాదం శనివారం కొత్త మలుపు తిరిగింది. ఈ నెలకు సంబంధించి కొందరు ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం అధికార పార్టీ నాయకుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. నియామకాలకు సంబంధించి ఓ కౌన్సిలర్ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చివరికి ఈ వ్యవహారం కాస్తా అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య బేదాభిప్రాయాలకు దారి తీసే పరిస్థితికి చేరుకుంది.

ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా మున్సిపాలిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దనే చర్చ నడుస్తున్నా కామాటీల నియామకాల్లో ఓ మహిళా కౌన్సిలర్ భర్త తనను ఆశ్రయించిన వారి నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి అదనంగా ఏజెన్సీ వారికి సదరు ఉద్యోగార్ధి రూ. 50 వేల వరకూ సమర్పించుకోవాల్సిన పరిస్థితి మున్సిపాలిటీలో నెలకొంది. గత నియామకాల్లో కూడా ఈ వ్యక్తే కీలక పాత్ర పోషించారని సమాచారం. దీంతో కోదాడ మున్సిపాలిటీ అప్రతిష్ట పాలవుతోందని టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాపోతున్నారు. ఈ అవినీతిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుని అర్హులైన వారికి కామాటీ నియామకాల్లో అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గత తీర్మానం ప్రకారమే ఈ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.

Next Story

Most Viewed