భగ్గుమన్న కోమటిరెడ్డి అనుచరులు.. అద్దంకి దిష్టిబొమ్మలు దహనం

by Disha Web |
భగ్గుమన్న కోమటిరెడ్డి అనుచరులు.. అద్దంకి దిష్టిబొమ్మలు దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. గంట గంటకు నేతల మధ్య మాటల తీవ్రత జోరందుకుంటోంది. చండూరు సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అద్దంకి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి అనుచరులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. అద్దంకి దయాకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వెంటనే కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో కోమటిరెడ్డి అనుచరులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

అద్దంకి దయాకర్‌ను తుంగతుర్తి ప్రాంతానికి పరిచయం చేసిందే కోమటిరెడ్డి సోదరులని, ఆర్థిక సహకారం అందించి పార్టీలో నిలదొక్కుకునేలా చేసిన కోమటిరెడ్డిపై నోరుజారడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అద్దంకి కామెంట్స్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డిపై బూతుపదం వాడినందుకు అద్దంకి దయాకర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్దపడుతోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలోని మరికొందరు సీనియర్లు సైతం ఆయన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చండూరు సభలో నోరు జారిన అద్దంకి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో మరో దుమారానికి కారణం అయింది. ఈ అంశంలో ఇప్పటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ రియాక్ట్ కాలేదు.

Next Story

Most Viewed