టెన్షన్ పెట్టిస్తోన్న 'కొల్లాపూర్' రాజకీయం.. కేటీఆర్ ఎంట్రీతో మరింత వేడి

by Disha Web Desk 2 |
టెన్షన్ పెట్టిస్తోన్న కొల్లాపూర్ రాజకీయం.. కేటీఆర్ ఎంట్రీతో మరింత వేడి
X

కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయం రస్తవత్తరంగా మారుతున్నది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్నారు. ఈనెల 26వ తేదీన బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధమయ్యారు. ఇద్దరు నేతలు ఎస్పీ కార్యాలయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పోలీసుల అనుమతి లభించడం అనుమానామే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనుమతులు రాకుంటే నిబంధనలకు విరుద్ధంగా చర్చలు జరుపుతారా? లేక వాయిదా వేసుకుంటారా? అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొల్లాపూర్ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల పోరుసై అంటే.. సై అన్నట్లుగా సాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల మధ్య సాగుతున్న పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. 2018 సంవత్సరానికి ముందు వేరు వేరు పార్టీలలో ఉండి సాగించిన ఆధిపత్య పోరును ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ సాగిస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరువురు నేతల సంగతి అటుంచితే పార్టీ శ్రేణులు సైతం రెండు గ్రూపులుగా విడిపోయి తమ నేతలకు మద్దతుగా సామాజిక మాధ్యమాలలో ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో అయితే పరస్పర దాడులు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాలలో పరిస్థితులు నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో జూపల్లి, బీరం ఒకరిపై మరొకరు మీడియా సాక్షిగా ఆరోపణలు చేయడం కొల్లాపూర్‌లో మాత్రమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ వేడిని రగిలించింది. మరోవైపు ఇరువురు నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడంతో నియోజకవర్గంపై పట్టుకోసం వారి వారి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు వల్ల జరిగే పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమతుల కోసం దరఖాస్తులు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు.. ఎవరి హయాంలో ఏమేమి అక్రమాలు.. అవినీతి జరిగిందో చర్చిద్దాం రా అని ముందుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే‌కు సవాల్ విసిరారు.. ఈ సవాలును స్వీకరించిన ఎమ్మెల్యే బీరం సైతం బహిరంగ చర్చ సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు.. దీనితో ఇరువర్గాల మధ్య మరింత రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్రమంలో ఈనెల 26న బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి జూపల్లి అనుచరులు ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. తాజాగా గురువారం ఎమ్మెల్యే జూపల్లి అనుచరులు సైతం ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఈనెల 26 న అంబేద్కర్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని సంబంధిత అధికారులకు దరఖాస్తు చేశారు.

కేటీఆర్ రాకతో మరింత వేడి

ఇటీవల రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ పర్యటనకు రావడం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, బహిరంగ సభలో ప్రసంగించడం.. ఆపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచర వర్గానికి మింగుడు పడలేదు. మరోవైపు కేటీఆర్ జూపల్లి ఇంటికి వెళ్లడం వల్ల ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశించారు. కానీ, ఆచరణలో అది సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికలలో టికెట్టు.. మా నేతకే అని ఒక వర్గం.. కాదు మా నేతకే అని మరో వర్గం చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాలలో మాటల యుద్ధానికి దిగుతున్నారు.

అనుమతి ఇచ్చేది అనుమానమే

అధికార పార్టీ నేతల మధ్య ఈనెల 26న జరగాల్సిన బహిరంగ చర్చకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకపోవచ్చునని రాజకీయ నిపుణులు అంటున్నారు. శాంతిభద్రతలకు బంధం కలిగించేలా కార్యక్రమాలు ఉండడం.. అటువంటి వాటికి అనుమతులు లభించే అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల నుంచి అనుమతులు రాకుంటే ఆరోజు నిబంధనలకు విరుద్ధంగా చర్చలు జరుపుతారా.. లేక వాయిదా వేసుకుంటారా అని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.



Next Story