మోదీపై తగ్గిన దూకుడు.. కేసీఆర్ 'మౌన వ్యూహం' అందుకేనా?

by Disha Web Desk 4 |
మోదీపై తగ్గిన దూకుడు..  కేసీఆర్ మౌన వ్యూహం అందుకేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోడీపై టీఆర్ఎస్ దూకుడు తగ్గింది. బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప్ సభ సక్సెస్ తో కొంతకాలం సైలెంట్ గా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లుంది. ఈ సభలో పీఎం మోడీ విమర్శలు చేయకపోగా.. తెలంగాణకు చేసిన అభివృద్ధిని మాత్రమే వివరించారు. కేసీఆర్ పై, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతారని నేతలు భావించినప్పటికీ.. అలా చేయలేదు. ఒకవేళ బీజేపీపై, మోడీపై విమర్శలు చేస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో హైప్ ఇచ్చిన వారమవుతామని, అందుకే కేసీఆర్, కేటీఆర్ దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర నిధులపై మాట్లాడటంతో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుతోనే సమాధానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే యువతలో సైతం మైనస్ అవుతామని టీఆర్ఎస్ అధిష్టానం భావించిందని, అదునుకోసం కొంతకాలం సైలెంట్ ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

మోడీ పాలనపై గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజా సంక్షేమం విస్మరించారని, దేశ ఔనత్యాన్ని విదేశాల్లో దెబ్బతీస్తున్నారని కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సైతం విరుచుకుపడటంతో పాటు 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం కాదుకదా.. కేసీఆర్ ప్రస్తావన లేకుండానే బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప్ సభలో మోడీ ప్రసంగించారు. దీంతో టీఆర్ఎస్ డైలమాలో పడింది. సభలో మోడీ తెలంగాణకు నిధులు కేటాయించామని ప్రస్తావన చేయడంతో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుతో అటాక్ చేయించారు. మోడీ అసత్యాలు మానుకోవాలని, వాస్తవాలు తెలుసుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి నల్లధనం తీసుకురావడం దగ్గర నుంచి లోక్ పాల్, లోకాయుక్త బిల్లులు తేవడంలో బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు మెడికల్ కాలేజీ, జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని కేంద్రంపై మండిపడ్డారు. ఈ స్థాయిలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం విమర్శలు చేయలేదు. కేవలం బీజేపీపై, కేంద్రమంత్రుల వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం బీజేపీ నేతల తీరును ఎండగట్టారు. గుజరాత్ తో పోలుస్తూ తెలంగాణ అభివృద్ధి, దేశ జీఎస్డీపీని వివరించారు తప్ప.. మోడీపై విమర్శలు చేయలేదు. కేసీఆర్ సైతం సైలెంట్ అయిపోయారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నట్లు మీడియా సమాచారం ఇచ్చారు.. కానీ కేవలం పలుశాఖల అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్షలకే పరిమితం అయ్యారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాత్రం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చితే మాకు ఏం పని ఉండదు.. కేంద్రంలోని బీజేపీని కూల్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆ తర్వాత బీజేపీ సభలో కేంద్రమంత్రులు, బండి సంజయ్ చేసిన విమర్శలకు మాత్రం కౌంటర్ ఇవ్వలేదు.

నేతలంతా బండి, బీజేపీపైనే మండిపాటు

టీఆర్ఎస్ ది రజాకార్ల పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది. కేసీఆర్ గడీలో తెలంగాణ బంధీ అయిందని, విముక్తి కోసం పోరాటం చేస్తామని బండి సంజయ్, ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్ అని..ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే అధికారం అని అమిత్ షా, కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. దానిని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. కానీ ఎవరూ కూడా మోడీపై ఘాటు విమర్శలు చేయలేదు.

యువతలో మైనస్ కావొద్దనే ఆలోచన!

యువతలో మోడీ అంటే ఓ క్రేజ్.. బీజేపీ సభకు వచ్చింది సైతం ఎక్కువగా యువతనే. అయితే కేసీఆర్ పై గానీ, కేసీఆర్ కుటుంబంపైగానీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో డైలామాలో పడ్డారు. ఒకవేళ కేసీఆర్ గానీ స్పందించి విమర్శలు చేస్తే యువతలో మైనస్ అయ్యే అవకాశం ఎక్కువ అని గ్రహించి కొంతకాలం సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలపై మాత్రం విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. తెలంగాణ సాధించిన ప్రగతి, ఇతర రాష్ట్రాలతో పోలిక మాత్రం చేశారు. బీజేపీ నేతల విమర్శలకు ప్రతి విమర్శలు చేయలేదు అంటేనే కొంత పొలిటికల్ స్ట్రాటజీ క్లీయర్ గా అర్ధమవుతోంది. కానీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. పైకి ఆర్భాటం చేయకపోయినా గ్రౌండ్ వర్క్ ను మాత్రం విస్తృతం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Next Story

Most Viewed