ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్.. చెక్ పెట్టేందుకు వైసీపీ భారీ స్కెచ్

by Disha Web Desk 4 |
ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్.. చెక్ పెట్టేందుకు వైసీపీ భారీ స్కెచ్
X

దిశ, ఏపీ బ్యూరో: తన అసలు బలం ఎక్కడో గుర్తించే పనిలో జనసేనాని పడ్డారు. సరైన ప్రయత్నం చేయాలే గానీ తనను నెత్తిన పెట్టుకునే గోదావరి జిల్లాలపై దృష్టి సారించారు. జనసేన వర్గాలు చెబుతున్న ప్రకారం గత ఎన్నికల్లోనే గోదావరి జిల్లాలపై సరిగ్గా దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని పటిష్ట పరిచుంటే కచ్ఛితంగా జనసేనకు మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆయన సన్నిహితుల వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పార్టీలో కొరవడిన సమన్వయం, కమ్యూనికేషన్ గ్యాప్, ఓవర్ కాన్ఫిడెన్స్ జనసేన ను దెబ్బ తీసినట్టు పొలిటికల్ విశ్లేషకులూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు రాబట్టాలంటే.. ముందుగా గోదావరి జిల్లాలపై దృష్టి సారించడం అత్యవసరమని జనసేన భావిస్తున్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అడుగులు కూడా ఆ వైపుగానే పడుతున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారం డిసైడయ్యేది ఇక్కడే

ఉభయగోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యవంతం కలిగిన జిల్లాలు. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలో అనేది డిసైడ్ చేసేది ఈ రెండు జిల్లాలే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ప్రస్తుత విభజిత రాష్ట్రంలో గానీ ఈ రెండు జిల్లాలే రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. అంతేకాదు రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలు కూడా ఇవే కావడంతో అన్ని పార్టీలూ ఈ ప్రాంతాలపైనే అత్యధికంగా ఫోకస్ పెడతాయి. ఎందుకంటే ఈ రెండు జిల్లాలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నది. ఇది చాలాసార్లు నిరూపితం కావడంతో రాజకీయ పార్టీలకు సెంటిమెంట్‌గా మారాయి. 2014లో టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఇక ఈ ఉభయగోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. దాదాపు 60 శాతం గెలుపోటములను ప్రభావితం చేయగలరు.

కింగ్ ఆర్ కింగ్ మేకర్!

ఇక మెగా ఫ్యామిలీకి విపరీతమైన ఆదరణ ఉన్న జిల్లాలు ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సొంతూరూ ఇదే. కాపు సామాజిక వర్గం అత్యధికంగా కలిగిన ప్రాంతాలూ ఇవే కావడం మరో కారణం. మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా.. అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించింది మాత్రం ఈ ప్రాంత వాసులే. పవన్‌ను సైతం ఎన్నికల్లో ఆదరించకపోయినా ఒక్క ఎమ్మెల్యేనైనా అసెంబ్లీకి పంపింది అంటే అది ఈ ప్రాంత ప్రజలే. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినా.. పవన్ జనసేనకు వెన్నంటి నిలిచిన వారిలో ముందు వరుసలో ఉభయగోదావరి జిల్లా నేతలే ఉంటారు. వీరంతా ఇప్పుడు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గతంలో కాపు సామాజిక వర్గం పేరెత్తని పవన్ కూడా ఇటీవల కాపు సామాజిక వర్గాన్ని పదేపదే గుర్తుకు తెస్తున్నారు. సెంటిమెంట్ అయిన వంగవీటి మోహన రంగాను సైతం తెరపైకి తెస్తున్నారు. పవన్ రాజకీయంగా ఉభయగోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టేశారని రాజకీయాల్లో ప్రచారం జరుగుతున్నది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్ష టీడీపీ విఫలమైందనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఒంటరిగా టీడీపీ అధికారంలోకి రావడం కూడా కష్టమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రోజు రోజుకు జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో అధికార పీఠంపై కూర్చోబెట్టే వారిని డిసైడ్ చేసే కింగ్ మేకర్ లేదా కింగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ భావిస్తున్నది. టీడీపీ, జనసేన, వైసీపీ విడివిడిగా పోటీ చేస్తే కచ్ఛితంగా లాభపడేది జనసేననే అని ప్రచారం జరుగుతున్నది. పవన్.. గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తున్నది. మెుత్తం 40 నుంచి 50 స్థానాలపై జనసేనాని ఫోకస్ పెట్టారని, అవి గెలిస్తే కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు 2014 ఎన్నికలను జనసేన నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ.. టీడీపీ విజయం వెనుక ఉన్న కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ అని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. ఇదే కోవలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాకపోయినా అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించి కింగ్ మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీలోని కీలక నేతలు అంటున్నారు.

వైసీపీపై వ్యతిరేకత కలిసి రానున్నదా?

గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన వైసీపీకి క్రమంగా పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. వాస్తవానికి గోదావరి జిల్లాల్లో కాపుల ఆధిపత్యం ఎక్కువ. కానీ ఇదే సమయంలో ఎస్సీ, క్షత్రియుల హవా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత నరసాపురం జిల్లాలో క్షత్రియులదే హవా. ఇక కాకినాడ జిల్లాలో కాపుల పెత్తనం. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎస్సీల ఓటు బ్యాంకు అధికం. కానీ.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులానికి, ఇతర కులాలతో పోరు ఉంటుంది కూడా. కొన్ని చోట్ల కాపులకు ఎస్సీలతో పోరు, మరోచోట క్షత్రియులతో ఆధిపత్య పోరు ఉంటుంది. 2019లో అన్ని వర్గాలను సంతృప్తి పరిచిన జగన్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీకి తలనొప్పి తప్పేలా లేదు. కోనసీమ జిల్లాలో ఎస్సీ, కాపులకు మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి కొనసాగుతున్నది. 2019 ఎన్నికల్లో రెండు వర్గాలను సమన్వయం చేసుకున్న వైసీపీ ప్రస్తుతం మాత్రం వీరి మధ్య ఆధిపత్య పోరును ఆపలేకపోతున్నది. తాజాగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ హత్యతో పాటు కోనసీమ జిల్లా పేరు మార్పు వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. వాస్తవానికి నరసాపురం జిల్లా పరిధిలో అయితే కాపు వర్సస్ క్షత్రియ అనేది సినీ హీరోల అభిమానుల మధ్య కూడా ఉంటుంది. పవన్, మరోక హీరో ఫ్యాన్స్‌కు మధ్య చాలా విషయాల్లో వివాదాలు చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ సర్కార్‌పై రాజులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ సామాజికి వర్గాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని, మంత్రివర్గం నుంచి శ్రీరంగనాథరాజు తొలగింపు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేధింపులు వంటి విషయాలను కారణాలుగా చూపుతున్నారు. తాజాగా కొత్తపల్లి సుబ్బారాయుడుపైనా చర్యలు ప్రారంభించింది. ఇది కూడా ఇప్పుడు కాపులను ఆగ్రహానికి గురి చేస్తున్నది. దీంతో క్రమంగా పవన్ పార్టీ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

మెగా ఫ్యామిలీకి కంచుకోట

2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన 18 సీట్లలో ఏకంగా 4 సీట్లు ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే వచ్చాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్..మరో వైపు చంద్రబాబు, కేసీఆర్‌లతో కూడిన మహాకూటమిని తట్టుకుని మరీ ఏకంగా 18శాతం ఓట్లను ప్రజారాజ్యం సాధించింది అంటే కారణం గోదావరి జిల్లాల ఓటర్లే కారణం. ఈ విశ్లేషణలో ఎక్కడ తడబడ్ధారో కానీ పవన్ 2019 లో ఈ జిల్లాలపై దృష్టి పెట్టలేదని మాత్రం నిపుణులు విశ్లేషణ చేస్తుంటారు. 2019లో ఓట‌మి పాలైన త‌ర్వాత ప‌వ‌న్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజ‌కీయం కూడా బాగా ఒంట‌బ‌ట్టింద‌ని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవ‌లే గోదావ‌రి జిల్లాల్లో కౌలు రైతు భ‌రోసా యాత్ర నిర్వహించారు. గోదావ‌రి జిల్లాల ప్రజలు తలచుకుంటే తాను ముఖ్యమంత్రి అవుతానని, మార్పు ఇక్కడ నుంచే రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గత ఎన్నిక‌ల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే జనసేన ఎక్కువ ఓట్లు సాధించింది. గెలుపొందిన రాజోలు నియోజకవర్గం కూడా ఈ జిల్లాలలోనిదే. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మెజారిటీ సీట్లను సాధించాల‌నే వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు సామాజిక‌వ‌ర్గంతోపాటు, బీసీ, క్షత్రియ సామాజిక‌వ‌ర్గాలు కూడా బ‌లంగా ఉన్నాయి. వీరిని త‌న‌వైపు ఆకట్టుకోగ‌లిగితే రాబోయే ఎన్నిక‌ల్లో అత్యధిక సీట్లు ఈ రెండు జిల్లాల నుంచే సాధించాల‌నే రాజకీయ వ్యూహంతో జనసేనాని ముందుకు వెళుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి.

ఎట్టి పరిస్థుతుల్లోనూ అసెంబ్లీకి వెళ్లాల్సిందే..

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ఈసారి మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. తమ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఆయనకు నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పోటీ చేస్తే విజయం సులభమని, అందుకు తగ్గ లెక్కలను వివరిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి పవన్ ఈసారి మళ్లీ పోటీచేస్తే విజయం ఎలా ఉంటుందనే విషయమై ఒక నియోజకవర్గంలో సర్వే జరిగినట్లు సమాచారం. ఆయన తీసుకునే నిర్ణయం, అమలు చేసే వ్యూహరచన పవన్‌తోపాటు మరికొంతమందిని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయడంతోపాటు జనసేన భవిష్యత్ ‌ను కూడా నిర్ధేశించబోతున్నది.

పవన్‌పై మైండ్ గేమ్ మొదలెట్టిన వైసీపీ?

పవన్ వ్యూహాన్ని గమనించిన అధికార వైసీపీ ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నది. స్వయంగా జగన్ ఇటీవల గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ పవన్ గెలిస్తే.. కాపు సామాజిక ఓట్లను టీడీపీకి అమ్మేస్తాడని చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే. ఏదైనా తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లను ఏ పార్టీ గెలిస్తే విజయం వాళ్లదే అనే సెంటిమెంట్ రాజకీయాల్లో బలంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఆ సెంటిమెంట్‌ను మరోసారి నిలబెట్టాలని, తద్వారా తన జనసేన పార్టీ ప్రభావాన్ని చాటాలని చూస్తున్న జనసేనాని వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి!


Next Story

Most Viewed