సీఎస్ సోమేశ్ కుమార్ ఎటువైపు.. ఆంధ్రాకా? తెలంగాణకా?

by Disha Web Desk 2 |
సీఎస్ సోమేశ్ కుమార్ ఎటువైపు.. ఆంధ్రాకా? తెలంగాణకా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ సహా మొత్తం 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్ర కోటాకు చెందినవారనేది త్వరలో తేలనున్నది. సమైక్య రాష్ట్ర కేడర్‌కు చెందిన వీరిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏపీ రాష్ట్రానికి కేటాయించింది. కానీ తెలంగాణలోనే పనిచేయడానికి సుముఖంగా ఉన్న వీరు క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయించారు. సానుకూలంగా ఉత్తర్వులు రావడంతో అప్పటి నుంచి తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దానిపై గత కొన్ని వారాలుగా విచారణ జరుగుతూ ఉన్నది.

జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ నందా నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ పూర్తి స్థాయిలో వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు అనుగుణంగానే ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసు అధికారుల విభజన ప్రక్రియను పూర్తిచేసిందని వివరించారు. రాజ్యాంగపరంగా కేంద్ర సర్వీసు అధికారుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగలేదని, రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులో ఏకపక్ష నిర్ణయాలు జరగలేదని, అధికారుల నుంచి 'రీజనబుల్ ఆప్షన్లు' తీసుకున్నామని వివరించారు. వీరి కేటాయింపులు శాస్త్రీయబద్ధంగానే జరిగాయని వివరించారు.

చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపించారు. క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనే పనిచేయాలనే అభిప్రాయాన్ని కేటాయింపు ప్రక్రియ సమయంలోనే వెల్లడించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనే కొనసాగవచ్చంటూ క్యాట్ వెల్లడించిన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఇరు తరఫున వాదనలను విన్న బెంచ్ తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. క్యాట్ గతంలో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం దాదాపు 80 మంది డాక్టర్లు ఏపీకి కేటాయింపు జరిగినా తెలంగాణలోనే కొనసాగుతున్నారు.

పూర్తిగా తెలంగాణకే కేటాయించాల్సిందిగా వారంతా విడివిడిగా దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణలు జరిపిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్ధించారు. కేటాయింపుకు అనుగుణంగా డాక్టర్లంతా తెలంగాణ నుంచి ఖాళీచేసి వెళ్ళిపోవాల్సిందేనని తీర్పునిచ్చారు. దీంతో తెలంగాణ డీఎంఈ కార్యాలయం సైతం దశలవారీగా ఆ డాక్టర్లకు రిలీవ్ అర్డర్లను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పిదం లేదని, శాస్త్రీయబద్ధంగానే కేటాయింపు ప్రక్రియ జరిగిందని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ తీర్పుల వెలుగులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై హైకోర్టు ఎలాంటి ముగింపుకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed