- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాలిలో దీపంగా వైరా టౌన్ ప్లానింగ్..!?
వైరా మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగం గాలిలో దీపంలా మారింది.

దిశ,వైరా: వైరా మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగం గాలిలో దీపంలా మారింది. అసలు వైరాలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఉందా? లేదా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వైరా నుంచి బదిలీ అయిన టిపిబిఓ నేటి వరకు రిలీవ్ కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు వైరాకు కేటాయించిన టిపిబిఓ బాధ్యతలు తీసుకునేందుకు నేటి వరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో అడిషనల్ చార్జీతో టిపిఓగా పనిచేసిన భాస్కర్ ఈనెల 3వ తేదీన సత్తుపల్లి మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వైరాకు టీపిబిఓ ( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్)గా కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి మల్లేష్‌ను బదిలీ చేశారు. అయితే వైరా నుంచి బదిలీ అయిన భాస్కర్ వారం రోజులు గడుస్తున్నా నేటి వరకు ఇక్కడి నుంచి రిలీవ్ కాలేదు. అలా అని విధులకు హాజరు కావడం లేదు.
మరో వైపు వైరాకు కేటాయించిన టిపిబివో మల్లేష్ నేటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో వారం రోజులుగా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ వైరాలో అస్తవ్యస్తంగా మారింది. వైరా నుంచి బదిలీ అయిన టీపిఓ రిలీవ్ కాకపోయినా, మరోవైపు వైరాకు కేటాయించిన టిపిబిఓ బాధ్యతలు చేపట్టకపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే గత నెలలో మధిర మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ కుమార్ కొన్ని రోజులు వైరాలో అడిషనల్ చార్జి కమిషనర్ గా పని చేశారు. ఆ సమయంలో టీపిఓ భాస్కర్ వైరాలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మున్సిపాలిటీ సిబ్బందిలో తీవ్ర ప్రచారం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మొత్తంలో ఎల్ఆర్ఎస్ నగదు సదరు భవన యజమాని నుంచి చెల్లింప చేశారని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి సుమారు రూ.10 లక్షలకు పైగా గండి పడిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రస్తుతం పాత బస్టాండ్ లో భవన అనుమతి ఇచ్చిన ప్రాంతంలో మార్కెట్ విలువ కంటే తక్కువ విలువతో ఎల్ఆర్ఎస్ విధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో పాత బస్టాండ్ లో ఇటీవల భవనాలు నిర్మించుకున్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద గజానికి ₹10,800 రేటు ప్రకారం ఎల్ఆర్ఎస్ నగదు వసూలు చేసిన అధికారులు, ప్రస్తుతం ఓ భవన నిర్మాణానికి గజానికి రూ.5800 ధరకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారాయని వైరాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.






