మొన్న నిర్మల్.. నేడు భైంసా.. పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీపై రగడ

by Disha Web |
మొన్న నిర్మల్.. నేడు భైంసా.. పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీపై రగడ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మొన్న నిర్మల్ మున్సిపాలిటీ.. నేడు భైంసా బల్దియా.. పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల పంచాయతీ మొదలైంది.. నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ రగడ రాజుకుంది. జాబితా వెల్లడించకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారంటూ బీజేపీ కౌన్సిలర్లు బహిరంగ విమర్శలకు దిగారు. పాలకవర్గం వారు తమ బంధువులు, సన్నిహితులకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక నిర్మల్ మున్సిపాలిటీలో పోస్టుల వ్యవహారంపై విచారణ మొదలవగా.. అర్హులకు దక్కుతాయా.. అస్మదీయులనే అందలం ఎక్కిస్తారా.. అనేది తేలాల్సి ఉంది. తాము అనుకున్న వారికే దక్కుతాయనే ధీమాలో అధికార పార్టీ నేతల ఉండటం కొసమెరుపు..!

నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీకి గత ఏడాది ప్రక్రియ ప్రారంభించగా.. తాజాగా వీటిని భర్తీ చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో 44 పోస్టులు, భైంసా మున్సిపాలిటీలో 16 పోస్టుల్లో చాలా వరకు అర్హులను కాదని.. అనర్హులకు కట్టబెట్టారు. ఈ పోస్టుల భర్తీలో కాసులిచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వగా.. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఏడో తరగతి విద్యార్హత కాగా.. నిర్మల్‌లో ఒక్కో పోస్టుకు 1:20 ప్రకారం880 మంది, భైంసా బల్దియాలో 1:100 చొప్పున 1800 మందికి ఉపాధి శాఖ లేఖలు పంపింది. వీరి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నా.. ఇంటర్వ్యూ ప్రక్రియ తూతూమంత్రంగా సాగింది. రోస్టర్ ప్రాతిపదికన మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక చేసే అధికారం జీవో నెంబర్ తేజ్ ప్రకారం జిల్లా కలెక్టర్‌కు ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు తాము అనుకున్న వారికి, పైసలు ఇచ్చిన వారికే పోస్టులను కట్టబెట్టడంతో అటు మీడియా కథనాలురాగా.. ఇటు విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఒక్కో పోస్టుకు రూ.12 నుండి 15 లక్షల వరకు చేతులు మారగా.. కొన్ని చోట్ల పాతిక లక్షలు పలికినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నిర్మల్ మున్సిపాలిటీలో నియామక ప్రక్రియ నిలిచిపోగా.. తాజాగా భైంసాలో పోస్టుల భర్తీపై పంచాయతీ మొదలైంది. భైంసాలో 16 పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి నుంచి అంతా రహస్యంగానే ఉంచుతున్నారు. నియామక ప్రక్రియ ఏ విధంగా చేపట్టారో వెల్లడించడం లేదు. జాబితా వెల్లడించకుండా.. గోప్యత పాటించడంతో అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ కూడా ఓ ఉద్యోగ సంఘం నాయకుడి భార్య, మున్సిపాలిటీలో పని చేసే ఉద్యోగి భార్య, ఓ పుర ప్రముఖ ప్రజా ప్రతినిధి బంధువులు, సన్నిహితులకు ఈ పోస్టులు ఇచ్చుకున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తవగా.. జాబితా బయటకి రాలేదు. ఒక విధులకు కేటాయించిన వారితో వేరే పనులు చేస్తున్నారు. అయినప్పటికీ జాబితాను బయటకి వెల్లడించడం లేదు. ఎవరెవరిని, ఏ ప్రాతిపదికన నియమించారు.. అసలు జాబితా ఎందుకు ప్రకటించడం లేదని.. మున్సిపల్ సమావేశంలో, అధికారులను అడిగితే చెప్పడం లేదని బీజేపీ కౌన్సిలర్లు అంటున్నారు.

ఇప్పటికే నిర్మల్ మున్సిపాలిటీలో పోస్టుల నియామక ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు మంత్రి అల్లోల ప్రకటించగా.. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు. 15 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని.. నిర్మల్ ఆర్డీవోను ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ ఓ నోట్ విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో సీడీఎంఏ అధికారులు విచారణ చేపట్టారు. పోస్టుల భర్తీ ప్రక్రియ ఏ విధంగా చేపట్టారు. నియమ నిబంధనలు పాటించారా.. లేదో వివరాలు సేకరించారు. ఇక ఆర్డీవో విచారణ ఇంకా ప్రారంభమే కాకపోగా.. సీడీఎంఏ విచారణ తర్వాతే చేస్తారటా. నిర్మల్‌లో 20 మంది గతంలో నుంచి మున్సిపాలిటీలో పని చేసే వారికి ఇవ్వగా.. మిగతా 24 పోస్టులు తమ అనుకున్న వారికే అప్పగించారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారగా.. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎవరి వాటాలు వారికి వెళ్లాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీ నాయకులు చెప్పినా.. డబ్బులు తగ్గించకపోవటంతో పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. తాము పార్టీకి సేవ చేసినా.. తాము చెప్పిన వారికి, తమ వారికి డబ్బులు లేనిదే ఇవ్వకపోవడంపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇక ముందు ప్రకటించిన జాబితా ప్రకారమే పోస్టులు వస్తాయనే ధీమాతో అధికార పార్టీ నేతలున్నారటా..!

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed