యాదాద్రిలో భారీ భూ మోసం.. బట్టబయలైన 'రియల్' కంపెనీ స్కామ్

by Disha Web Desk 2 |
యాదాద్రిలో భారీ భూ మోసం.. బట్టబయలైన రియల్ కంపెనీ స్కామ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ.. పైగా బడాబాబులంతా భాగస్వామ్యులు.. ఇంకేముంది.. వారంతా కలిసి ఓ భారీ భూ మోసానికి తెర లేపారు. ఈఎంఐ వెసులుబాటు పేరుతో మంచి ప్లాట్ల చూపి విక్రయాలు జరిపారు. వాయిదా చెల్లింపులు పూర్తికాగానే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆశజూపారు. దీంతో మంచి అవకాశం అనుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలన్నీ ఆ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేశారు. అప్పో సప్పో జేసి ఈఎంఐలు సమయానికి చెల్లించేశారు. కానీ, తీరా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసే సమయానికి స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం చేతులేత్తేసింది. దీంతో రూ.లక్షలు పోసి ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులంతా లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఓవైపు స్పెక్ట్రా కార్యాలయం.. మరోవైపు అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఏమాత్రం ఫలితం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు.

పుట్టగొడుగుల్లా స్పెక్ట్రా వెంచర్లు..

యాదాద్రి ఆలయ పునర్:నిర్మాణం నేపథ్యంలో యాదగిరిగుట్ట చుట్టూ వేలాది పంట భూములు వెంచర్లుగా మారాయి. ఒక్క దానికి అనుమతులు తీసుకుని పదుల సంఖ్యలో అదే వెంచర్లు చేయడం.. అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి.. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. ప్రధానంగా ఆలేరు నియోజకవర్గంలో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజపేట తదితర మండలాల్లో పదుల సంఖ్యలో స్పెక్ట్రా కంపెనీ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ వ్యవహారంలో కీలక పొలిటికల్ లీడర్లు ఎంటర్ కావడంతో 'తిలా పాపం.. తలా పిడికేడు' అన్న చందంగా వారి దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. యాదాద్రి ఆలయం పేరుతో చుట్టుపక్కలా 40 కిలోమీటర్ల మేర వెంచర్ల ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్లను విక్రయించేందుకు ఈఎంఐ వెసులుబాటును కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఒకేసారి డబ్బు చెల్లించడం కాకుండా.. ప్రతినెలా వాయిదా రూపంలో చెల్లించే అవకాశం ఉండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు భారీగా ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఇదే అదునుగా స్పెక్ట్రా యాజమాన్యం.. వాయిదా సొమ్ము క్లియర్ చేసినా.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో ఒక ప్లాట్ చూపించి.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే.. వేరే ప్లాట్లు చేస్తామని చెప్పడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెండ్రోజుల క్రితం LB నగర్‌లోని స్పెక్ట్రా కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. సోమవారం ఇదే విషయమై.. ప్రజావాణిలో స్పెక్ట్రా కంపెనీ మోసాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

స్పెక్ట్రా రూ.కోట్లలో మాయజాలం

ఆలేరు నియోజకవర్గంలోని మైలార్‌గూడెం, రామాజీపేట, మాసాయిపేట, సైదాపూర్ గ్రామాల్లో స్పెక్ట్రా వేల ఎకరాల్లో వెంచర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో వెంచరులో గజం రూ.6వేల నుంచి రూ.20వేలకు పైగా విక్రయించి యాజమాన్యం సొమ్ము చేసుకుంది. అయితే ఈ వెంచర్లలో ఈఎంఐ వెసులుబాటు ఉండడంతో పేద, మధ్యతరగతి, చిరుద్యోగుల కుటుంబాలే అధికంగా ప్లాట్లను కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం ఆ వెంచర్లలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారని, కొనుగోలు చేసేటప్పుడు చెప్పిన మాటలు.. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మార్చేశారని బాధిత కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. అధికారుల నుంచి కానీ స్పెక్ట్రా యాజమాన్యం నుంచి కానీ ఏలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

పొలిటికల్ లీడర్ల ప్రమేయం..

స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ యాదాద్రి చుట్టుపక్కల వేల ఎకరాల్లో పలు ప్రాంతాల్లో వెంచర్లను ఏర్పాటు చేసింది. అయితే ఇవన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంచర్లు ఏర్పాటు చేసే సమయం నుంచి ఇప్పటివరకు అనేకమంది స్పెక్ట్రా ఆగడాలపై ఫిర్యాదులు చేశారు. కానీ, ఏ ఒక్క అధికారి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. స్పెక్ట్రా రియల్ వెంచర్ల వెనుక స్థానికంగా ఉన్న కీలక నేతల ప్రమేయం ఉండడం వల్లే అధికారులు జోక్యం చేసుకోవడం లేదనే ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని స్పెక్ట్రా రియల్ కంపెనీ ఆగడాలపై చర్యలు తీసుకుంటారో? లేదో? వేచిచూడాల్సిందే.


Next Story