షాకింగ్ న్యూస్.. ఉదయ్ పూర్ హత్య ఘటన వెనుక ఉన్నది వారేనా..?

by Disha Web Desk 19 |
షాకింగ్ న్యూస్.. ఉదయ్ పూర్ హత్య ఘటన వెనుక ఉన్నది వారేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్:బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడని ఓ టైలర్‌ను దారుణం హత్య చేసిన ఘటన రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో కలకలం రేపుతోంది.మమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్ చేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల నుండి ఆమె పట్ల వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో నుపుర్ శర్మ ఫోటోను డీపీగా పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇద్దరు అత్యంత కిరాతకంగా చంపడం దేశవ్యాప్తంగా ఉలిక్కిపాటుకు గురి చేసింది.

ఈ ఘటనలో ఇంతలా ఉలిక్కిపాటుకు గురికావడానికి హంతకులు వ్యవహరించిన తీరే కారణం అని తెలుస్తోంది. అవును నిజమే.. దేశంలో నిత్యం అనేక చోట్ల హత్యలు జరుగుతున్నాయి. కానీ ఉదయ్ ఫూర్‌లో చోటు చేసుకున్న దారుణం అన్నింటికంటే భిన్నమైనదే కాకుండా హత్య అనంతరం హంతకుల ప్రవర్తన అచ్చం ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థను పోలి ఉండటం మరింత టెన్షన్ పెట్టిస్తోంది. దీంతో హంతకుల వెనుక ఉన్నదెవరూ? వారిని ప్రోత్సహించినదెవరూ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణం స్లీపర్ సెల్స్ పనేనా అనే అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. దీంతో ఈ కేసును కేంద్ర హోం శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది.

ఐసిస్ తరహా దారుణం..

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) గా పేరు గాంచిన ఉగ్రవాద సంస్థ మనుష్యులను గొంతు కోసి అత్యంత కృూరంగా చంపేస్తుంది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి ప్రపంచం ముందు ఉంచుతుంది. తమ లక్ష్యానికి అడ్డుగా ఉన్న వారందరిని ఇలాగే శిక్షిస్తామని హెచ్చరికలు సైతం జారీ చేస్తుంది. గతంలో సిరియాలో ఐసిస్ చేసిన దురాగతాలు ఎంత భయంకరంగా ఉండేవో ఊహించడమే కష్టం. రాజస్థాన్ ఘటనలోనూ ఇదే జరిగింది. టైలర్ పని చేసుకునే కన్హయ్య అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు గొంతు కోసి కృూరంగా పొట్టన పెట్టుకున్నారు.

ఈ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని చూపిస్తూ ఈ కత్తి ప్రధాని నరేంద్ర మోడీ వరకు చేరుతుందని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్య పథకం ప్రకారం జరిగిందని ఉదయ్ పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కన్హయ్య హత్యలో హంతకుల మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంతా ఐసిస్‌ను పోలి ఉండటంతో దేశంలో ఈ ఉగ్రవాద సంస్థ సీక్రెట్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది స్లీపర్‌ సెల్స్‌ పనేనా..?

ఉదయ్ పూర్ హత్య వెనుక అంతర్జాతీయ ఉగ్ర ముఠా హస్తం ఉందా అనే కోణంలో లోతైన విచారణకు ఎన్ఐఏకు ప్రభుత్వం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఆధారంగా పని చేస్తున్న ఓ తీవ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్ ఈ కిరాతకాన్ని చేపట్టి ఉంటుందనే అనుమానాలు నిఘా వర్గాల నుండి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదంపై గతంలో ఐక్యరాజ్యసమితి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల నుంచి ఉగ్రవాద సంస్థల్లోకి యువకులు చేరుతున్నారనే నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయగా అందులో భారత్ నుండి కూడా యువకులు ఐసిస్ లాంటి ఉగ్రసంస్థలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొవడం కలకలం రేపింది.

ముఖ్యంగా కేరళ, కర్ణాటక నుండి 'గణనీయమైన సంఖ్యలో' యువకులు ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తితో ఉన్నట్లు కథనాలు రావడం సంచలనమైంది. తాజా ఘటనతో స్లీపర్ సెల్స్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. దేశంలో రహస్యంగా ఎవరైనా ఉగ్రవాద సంస్థలకు పని చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే పాక్ ప్రేరేపిత సంస్థల ఆదేశాలతో భారత్ లో దాడులకు ప్లాన్ చేస్తుండగా వాటిని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుండి ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఆయుధాలు చేరవేసే ఉగ్రవాదుల ప్రణాళికను పోలీసులు పసిగట్టారు. అంతకు ముందు సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుండి పార్శిల్స్ రూపంలో పేలుడు పదార్థాలు రవాణా అవుతుండగా మార్గమధ్యలో పేలిపోవడంతో ఈ కుట్ర బయటపడింది.



Next Story

Most Viewed