భారత్ లో పెట్టుబడులకు అగ్రదేశాధినేతలకు ఆహ్వానం

by Dishanational1 |
భారత్ లో పెట్టుబడులకు అగ్రదేశాధినేతలకు ఆహ్వానం
X

మ్యూనిచ్: వాతవరణ కట్టుబాట్ల పట్ల భారత్ నిబద్ధత దాని పనితీరు నుంచి స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జీ7 సంపన్న దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క ప్రయత్నాలకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దేశంలో ఉద్భవిస్తున్న క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల కోసం భారీ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని వారిని ఆహ్వానించారు. 'మెరుగైన భవిష్యత్తులో పెట్టుబడి: వాతావరణం, శక్తి, ఆరోగ్యం' అనే అంశంపై జర్మనీలో నిర్వహించిన జీ7 సదస్సులో సోమవారం ఆయన ప్రసంగించారు.

నిర్దేశించిన సమయం కంటే తొమ్మిదేళ్ల ముందే శిలాజ రహిత వనరుల నుండి 40 శాతం శక్తి-సామర్థ్య లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. ఇది భారత్ సాధించిన ట్రాక్ రికార్డు అని ఉద్ఘాటించారు. అంతేకాకుండా 10శాతం ఇథనాల్‌ను పెట్రోల్ లో కలిపే లక్ష్యాన్ని కూడా ఐదు నెలల ముందుగానే చేరుకున్నామని అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలి పూర్తి సోలార్ శక్తితో నడిచే విమానాన్ని కూడా భారత్ కలిగి ఉందని తెలిపారు. భారత్ వంటి పెద్ద దేశాలు ఈ తరహా ఆశయాన్ని కలిగి ఉంటే, ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు.

పెట్టుబడులకు ఆహ్వానం

పరిశోధనలు, అవిష్కరణలు, తయారీ రంగంలో భారత్ లో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అనేక వనరులు భారత్ సొంతమని చెప్పారు. ప్రతి కొత్త సాంకేతికతకు భారతదేశం అందించే స్థాయి, ఆ సాంకేతికతను ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి తీసుకురాగలదని ఆయన నొక్కి చెప్పారు. గ్లాస్గో సమావేశంలో చెప్పిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అంశాన్ని గుర్తుచేశారు. ట్రిపుల్-పీ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. 'ప్రో ప్లానెట్ పీపుల్'తో సొంత దేశాల్లో ట్రిపుల్-పీ వ్యక్తుల సంఖ్యను పెంచే బాధ్యతను మనం అందరం తీసుకోవాలన్నారు. రాబోయే తరాలకు ఇది గొప్ప సహకారం అవుతుందని చెప్పారు.

సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో కరాచలనం చేశారు. మరోవైపు మోడీ పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో వాతవరణ చర్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ సుస్థిర అభివృద్ది భాగస్వామ్యాన్ని ప్రొత్సహించాల్సి అవసరం ఉందని చర్చించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యాన్యుయేల్ మాక్రన్ తో తేనీరు తాగారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకున్నారు. ఇక దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసాతోనూ మోడీ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య స్నేహం, వాణిజ్యం పెంపొందించే మార్గాలు, ప్రజల బంధాల గురించి ప్రస్తావించారు. మంగళవారం ఆయన తిరుగు ప్రయాణంలో యూఏఈ వెళ్లనున్నారు.


Next Story

Most Viewed