వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఆర్థికవ్యవస్థతో మెరుగైన వృద్ధి భారత్ సొంతం: ఆర్థికవేత్తలు!

by Disha Web |
వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఆర్థికవ్యవస్థతో మెరుగైన వృద్ధి భారత్ సొంతం: ఆర్థికవేత్తలు!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో మెరుగైన వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనం నేపథ్యంలో వృద్ధి మెరుగ్గా ఉంటుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 7-7.8 శాతం వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ బయటి మూలాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వైస్-ఛాన్సలర్ ఎన్ఆర్ భానుమూర్తి చెప్పారు. గ్లోబల్ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆర్థికవ్యవస్థకు నష్టాన్ని కల్గించాయని, అయితే దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉండటం, అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థకలకు భిన్నంగా భారత్ కొవిడ్ ఉద్దీపన చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా ఆర్థిక విధానాల్లో సంస్కరణల వల్ల తక్కువ ద్రవ్యోల్బణ ప్రభావం, మెరుగైన వృద్ధికి అవకాశం కల్పించనున్నాయని ఆయన వివరించారు.

మెరుగైన వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో భారత్ 2022లో 7 శాతం వృద్ధిని సాధించగలదన్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని మరో ఆర్థికవేత్త, ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్(ఐఎస్ఐడీ) డైరెక్టర్ నగేష్ కుమార్ వ్యక్తం చేశారు. 2022-23లోపు భారత్ 7-7.8 శాతం జీడీపీ వృద్ధితో ఊపందుకుంటుందన్నారు. ఇంధన, ఎరువుల దిగుమతుల ధరల భారం వల్ల భారత్ ఎక్కువ ప్రభావితమవుతుందని ఫ్రెంచ్ ఆర్థికవేత్త గై సోమన్ అన్నారు.

Next Story