పన్నులు పెంచలేదు.. అప్పులు తీరుస్తూనే ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నాం : డిప్యూటీ సీఎం

by Batti.Sumithra |

గత పాలకుల చేతకానితనం వల్ల రాష్ట్రం పై పడిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూనే, ఏటా రూ. 76 వేల కోట్లు అసలు, వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

పన్నులు పెంచలేదు.. అప్పులు తీరుస్తూనే ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నాం : డిప్యూటీ సీఎం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : గత పాలకుల చేతకానితనం వల్ల రాష్ట్రం పై పడిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూనే, ఏటా రూ. 76 వేల కోట్లు అసలు, వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన విద్యుత్ శాఖ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. రోజుకో అబద్ధం సృష్టిస్తూ, కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల వైఖరి పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని వివరించారు.

డిస్కంలను ముంచిన బీఆర్‌ఎస్.. ఆదుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం !

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉచిత కరెంట్ పేరుతో ఓట్లు దండుకుందే తప్ప, డిస్కంలకు నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. గత పాలకులు పెట్టిన బకాయిలను క్లియర్ చేస్తూనే, రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ. 14 వేల కోట్లను మా ఆర్థిక శాఖ ద్వారా ప్రతి నెలా ప్రణాళికాబద్ధంగా డిస్కంలకు చెల్లిస్తున్నాం. ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం అని చెప్పారు. 2023-24లో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినప్పుడే చేతులెత్తేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, తమ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,546 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదైనప్పటికీ కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసి ఘనత సాధించిందని తెలిపారు. హరీశ్‌రావు వేస్తున్న అభాండాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రోజుకో అబద్ధంతో కట్టుకథలు అల్లుతూ విషప్రచారం చేస్తున్న వారిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రూపాయి పన్ను పెంచకుండానే ‘అద్భుత ప్రగతి’..

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు వడ్డీలేని రుణాల కింద కేవలం రెండున్నరేళ్లలోనే రూ. 67 వేల కోట్ల రుణాలు అందించామని భువనగిరి గడ్డ పై నుంచి ప్రకటించారు. ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ. 1.25 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారానే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో నడిపేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని కోటి 6 లక్షల పేద కుటుంబాలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రూ. 50-55 విలువైన సన్న బియ్యానికి ఉచితంగా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, కొద్ది రోజుల్లోనే 76 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్రమపద్ధతిలో విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇక పై దళారీల ప్రమేయం లేకుండా ఈ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేసే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు.

డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసం.. రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం పేదలను దారుణంగా మోసం చేసిందని, ఆ సొమ్మంతా వారి ఇళ్లకే వెళ్లిపోయిందని భట్టి విమర్శించారు. దానికి భిన్నంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద ఇల్లు లేని ప్రతి పేదవానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలోనే రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు.

కోటి 15 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’

దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు కులమతాలకు అతీతంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ. 5 లక్షల భీమా రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు రోజుకు 18 గంటలు శ్రమిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన అప్పుల భారం లేకపోతే తెలంగాణ దశ, దిశ ఇప్పటికీ పూర్తిగా మారిపోయేదని వ్యాఖ్యానించారు. బసవాపురం భూ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ వారికి పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన..

టీజీఎస్‌పీడీసీఎల్ యాదాద్రి భువనగిరి జిల్లా సర్కిల్ పరిధిలో, భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్ పక్కన రూ. 5.83 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సర్కిల్ కార్యాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో రూ. 2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఇదే కార్యక్రమం నుంచి రిమోట్ విధానంలో ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనుంది. అలాగే భువనగిరి మండలం హనుమాపురం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా రూ. 2.03 కోట్లతో నిర్మించనున్న ‘స్టోర్ కాంప్లెక్స్’కు, వలిగొండ మండలం నర్సాపూర్ గ్రామంలో రూ. 3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, తడక వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిష్తీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.

Next Story