క్లైమేట్ చేంజ్‌కు కారణమవుతున్న హెల్త్‌కేర్ ఇండస్ట్రీ!

by Disha Web Desk 7 |
క్లైమేట్ చేంజ్‌కు కారణమవుతున్న హెల్త్‌కేర్ ఇండస్ట్రీ!
X

దిశ, ఫీచర్స్ : మానవుల ఆరోగ్యాన్ని కాపాడటంలో 'హెల్త్‌కేర్ ఇండస్ట్రీ' ముందుంటుంది. అయితే కార్పొరేట్ ఆస్పత్రుల రాకతో ఈ రంగం తన రూపాన్ని సమూలంగా మార్చుకుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ మేరకు తలనొప్పి నుంచి గుండెనొప్పి వరకు దేనికోసం ఆస్రత్రికి వెళ్లినా సరే ముందు ఓ పదిరకాల టెస్ట్‌లు రాసి.. ఆ రిపోర్ట్స్ చూస్తే కానీ వైద్యం చేయని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఓ వైపు రోగికి ఆర్థికభారం పెరుగుతుంటే, మరో వైపు ప్రకృతికి విఘాతం కలుగుతుంది. ఏదేమైనా 'హెల్త్‌కేర్ ఇండస్ట్రీ' గణనీయమైన వాతావరణ మార్పులకు కారణమవుతుండగా.. 'గ్లోబల్ హెల్త్ కేర్‌'ను ఒక దేశంతో పోలిస్తే, అది ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఉద్గారిణిగా నిలుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4.4 శాతం కర్బన ఉద్గారాలకు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ బాధ్యత వహిస్తుండగా, వాతావరణ మార్పులకు గణనీయంగా దోహదపడుతోంది. కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 45 శాతం.. పరికరాలు, మెడిసిన్ కొనుగోలు నుంచి వచ్చినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఉద్గారాల విశ్లేషణ వెల్లడించింది. ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సేవలను నిర్వహించేందుకు అవసరమైన విద్యుత్, గ్యాస్ నుంచి 10 శాతం మాత్రమే ఉద్గారాలు వెలువడుతున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ విశ్వవిద్యాలయాల పరిశోధన ప్రకారం, ఒక MRI స్కాన్ 17.5kg CO₂కి సమానమైన కార్బన్ పాదముద్రను విడుదల చేస్తుందని, అదే విధంగా ఒక CT స్కాన్ 9.2kg CO₂ పాదముద్రను రిలీజ్ చేస్తోంది. X-రే (కార్బన్ ఫుట్‌ప్రింట్ - 0.76kg CO₂), అల్ట్రాసౌండ్ (కార్బన్ ఫుట్‌ప్రింట్- 0.53kg CO2 ) వల్ల కూడా ఉద్గారాలు అధికమొత్తంలో గాల్లోకి వెలువడుతున్నాయి.

అనవసరమైన పరీక్షలు, చికిత్సలను తగ్గించడం సహా అధిక కార్బన్ నుంచి తక్కువ కార్బన్ ప్రత్యామ్నాయాలకు మారడం వల్ల మాత్రమే ఉద్గారాలను తగ్గించవచ్చు. అనవసరమైన స్కాన్స్ వల్ల ఆస్పత్రి ఆదాయం పెరుగుతుంది తప్ప రోగులకు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు రక్తపరీక్షల వల్ల వెలువడే ఉద్గారాలు రోగులకు హాని కలిగించకుండా ఉండేందుకు ఆస్పత్రులు ప్రయత్నించాలి. ఉదాహరణకు : మత్తుమందు నిపుణులు.. డెస్‌ఫ్లూరేన్ (కిలోకి 2,540కిలోల CO₂ సమానం)కి బదులుగా వైద్యపరంగా సమానమైన మత్తుమందు వాయువు సెవోఫ్లోరేన్ (కిలోకి 144కిలోల CO₂ సమానం) ఉపయోగించవచ్చు.

సాధారణ అనస్థీషియా నుంచి నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్ గ్యాస్ (265kg CO2 సమానమైనది)మినహాయించాలని, అధిక స్థాయి ఉద్గారాల కారణంగా దాని ఉపయోగాన్ని తగ్గించాలని పర్యావరణహిత కార్యకర్తలు పిలుపునిచ్చారు. అంతేకాదు ఆస్తమా రోగుల విషయానికి వస్తే మీటర్ డోస్ ఇన్‌హేలర్‌ల నుంచి డ్రై-పౌడర్ ఇన్‌హేలర్‌ల వైపు తరలించడం వల్ల వార్షిక కార్బన్ పాదముద్రను 439kg నుంచి 17kg CO2కి సమానంగా తగ్గించవచ్చు. స్కాండినేవియన్ దేశాల్లో 90 శాతం ఇన్‌హేలర్స్ ప్రస్తుతం డ్రై-పౌడర్‌గా ఉన్నాయి.


Next Story

Most Viewed