గురుకులాల బాధ్యతలకు ఐఏఎస్ విజయేంద్ర దూరం

by Malleboina Mahesh |

ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఐఏఎస్ విజయేంద్ర బోయి బాధ్యతలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.

గురుకులాల బాధ్యతలకు ఐఏఎస్ విజయేంద్ర దూరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్సీ గురుకులాల సెక్రటరీగా పనిచేసేందుకు ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయికు ఇష్టం లేదా ? అందుకే ఆమె ఆ సంస్థ బాధ్యత తీసుకోకుండా దూరంగా ఉన్నారా ? లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలను ఫేస్ చేసే శక్తి లేక మౌనంగా ఉన్నారా ? అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. సుమారు నెలన్నర రోజుల పాటు సెలవుపై వెళ్లిన విజయేంద్ర గత వారం విధుల్లో చేరి, ఎస్సీడీ సెక్రటరీగా, కమిషనర్‌గా చార్జి తీసుకున్నారు. కానీ గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకోకుండా ఉండడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏరికోరి గురుకులాల బాధ్యతలు

ఎస్సీ గురుకులాల్లో తరుచుగా పుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. సరైన అధికారి ఉంటే గురుకులాలు గాడిలో పడుతాయని భావించిన ప్రభుత్వం 2006 బ్యాచ్‌కు చెందిన విజయేంద్ర బోయిని గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అదేసమయంలో ఆమెను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా, కమిషనర్‌గా నియమించారు. మూడు చోట్ల ఒకే ఆఫీసరు ఉండటంతో నిర్ణయాల్లో వేగం ఉంటుందని ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే వ్యక్తిగత కారణాల కారణంగా ఆమె దాదాపు నెలన్నరపాటు సెలవుల్లో వెళ్లి గత వారం డ్యూటీ లో చేరారు. కానీ అత్యంత ముఖ్యమైన గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టకుండా, ఎస్సీడీ సెక్రటరీ, కమిషనర్‌గా బాధ్యతు తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటీ? అనే చర్చ జరుగుతున్నది.

ప్రొక్యూర్మెంట్ భయమా?

వెల్కమ్ కిట్ పేరుతో గురుకులాల పిల్లలకు అందించే యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బుక్స్, బూట్లు, సాక్సులు మొత్తం 24 రకాల వస్తువులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వస్తువుల కొనుగోళ్లు గతంలో సొసైటీలవారీగా జరిగేది. ఒకే వస్తువు ఒక సొసైటీలో ఒక రేటుకు మరో సొసైటీలో మరో ధరకు కొనుగోలు చేసేవారు. దీంతో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సేకరించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు ఎస్సీ గురుకులాల సెక్రటరీని కొనుగోళ్ల కమిటీకి చైర్ పర్సన్‌గా నియమించారు. ఈ ప్రక్రియ ప్రారంభయ్యే సమయంలో ఎస్సీ గురుకులాల సెక్రటరీ గా ఉన్న విజయేంద్ర వ్యక్తిగత కారణాలతో పక్షం రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు.

సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ మరికొన్ని రోజులు సెలవును పొడగించుకున్నారు. సుమారు నెలన్నరపాటు సెలవును పొడగించుకుని గత వారమే డ్యూటీ లో చేరారు. కానీ ఎస్సీడీ సెక్రటరీ, కమిషనర్‌గా చార్జి తీసుకుని గురుకులాల సెక్రటరీగా మాత్రం బాధ్యతలు చేపట్టలేదు. అందుకు ప్రొక్యూర్మెంట్‌లో జరుగుతోన్న పరిణామాలే అందుకు కారణమని తెలుస్తున్నది. సుమారు 11 వందల కోట్ల వ్యయంతో వెల్కమ్ కిట్ల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానంతోనే విజయేంద్ర బాధ్యతలు చేపట్టలేదేమోనని చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.

మంత్రి చెప్పినా వినలేదా?

విజయేంద్ర సెలవుల్లో ఉండటంతో గురుకులాల సెక్రటరీ బాధ్యతలను జాయింట్ సెక్రటరీ హోదాలోని శారదకు ఇన్ చార్జిగా నియమించి, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే సెలవుల నుంచి వచ్చిన తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిసిన సందర్భంగా వెంటనే గురుకులాల సెక్రటరీగా సైతం బాధ్యతలు చేపట్టి, అడ్మినిస్ట్రేషన్ ను గాడిలో పెట్టాలని ఆదేశించగా సరే నంటూ తలూపిన ఆమె సంస్థ వైపునకు వెళ్లలేదని ప్రచారం జరుగుతున్నది. సోమవారం మంత్రి విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల గురుకుల విద్యాలయాల సంస్థలోని ప్రిన్సిపాల్స్,జోనల్ అధికారులు,హెడ్ ఆఫీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు ఎస్సీడీ సెక్రటరీ,కమిషనర్ హోదాలో విజయేంద్ర, గురుకులాల సెక్రటరీగా శారద హాజరయ్యారు.

Next Story