ఏలియన్ ఆస్టరాయిడ్‌‌ను ఢీకొట్టనున్న స్పేస్‌క్రాఫ్ట్

by Disha Web |
ఏలియన్ ఆస్టరాయిడ్‌‌ను ఢీకొట్టనున్న స్పేస్‌క్రాఫ్ట్
X

దిశ, ఫీచర్స్ : నవంబర్ 2021లో ప్రారంభించబడిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్(DART) లేదా డార్ట్ మిషన్ ఏలియన్ ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. ఇది 100 రోజుల కంటే తక్కువ సమయంలోనే తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను మళ్లించగల కొత్త సాంకేతికతను ప్రదర్శించేందుకు DART మిషన్‌లో భాగంగా మానవ నిర్మిత స్పేస్ క్రాఫ్ట్ ఉల్కను ఢీకొట్టనుంది.

భూమికి సమీపంలోని వస్తువులు(NEOలు)గా తెలిసిన గ్రహశకలాలు, తోకచుక్కలు గ్రహాల వలె సూర్యుని చుట్టూ తిరుగుతాయి. కానీ కక్ష్యలు వాటిని భూమి పరిసరాల్లోకి అంటే భూ కక్ష్య నుంచి 30 మిలియన్ మైళ్లలోపు తీసుకురాగలవు. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీని ప్రదర్శించేందుకు నాసా అంతరిక్ష నౌకను ఉద్దేశపూర్వకంగా ఒక గ్రహ శకలంలోకి క్రాష్ చేయిస్తుంది. దాని వేగం, మార్గాన్ని సర్దుబాటు చేయడానికి ఉల్కను ఢీకొడుతుంది. టార్గెట్ విషయానికొస్తే.. 'డిడిమోస్(రెండు గ్రహ శకలాలతో కూడిన బైనరీ ఆస్టరాయిడ్ వ్యవస్థ)'. ఈ పెద్ద గ్రహశకలం (వ్యాసం: 780 మీటర్లు, 0.48 మైళ్ళు) చుట్టూ చిన్న మూన్‌లెట్ గ్రహశకలం 'డిమోర్ఫోస్(వ్యాసం: 160 మీటర్లు, 525 అడుగులు)' తిరుగుతూ ఉంటుంది. అయితే డిడిమోస్ వ్యవస్థ భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు భూమి-ఆధారిత టెలిస్కోప్‌లు, ప్లానెటరీ రాడార్‌ల ద్వారా పరిశీలనలను నిర్ధారించుకుని సెప్టెంబరు 2022 చివరలో అంతరిక్ష నౌక ఆస్టరాయిడ్‌లో కూలిపోతుంది.

'DART అనేది ఒక గ్రహశకలంపై గతి ప్రభావాన్ని సాధించి దాని ప్రతిస్పందనను గమనించడంలో మా సామర్థ్యానికి ఒక పరీక్ష. టార్గెట్ చేయబడిన గ్రహ శకలం Dimorphosపై DART గతి ప్రభావం తర్వాత భూమిపై టెలిస్కోప్‌లను ఉపయోగించి అంతరిక్షంలో గ్రహశకలం చలనాన్ని అది ఎంతగా మార్చిందో పరిశోధన బృందం కొలుస్తుంది' అని నాసా తెలిపింది. ప్రస్తుతానికి బైనరీ ఆస్టరాయిడ్ వ్యవస్థ భూమికి ఎలాంటి ముప్పును కలిగించదు. వ్యోమనౌక గ్రహశకలాన్ని ఢీకొన్నప్పుడు గంటకు దాదాపు 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. క్రాష్ నుండి వచ్చిన డేటా.. ల్యాబ్‌లో మినీ-ఇంపాక్ట్‌లను, ఆ ఫలితాల ఆధారంగా అధునాతన కంప్యూటర్ మోడల్స్‌ను రూపొందించడంలో సాయపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story