బొడ్డు తాడు రక్తంతో.. హెచ్‌ఐవీ క్యూర్..! భవిష్యత్తులో కీలకంగా కొత్త పద్ధతి

by Mahesh |
బొడ్డు తాడు రక్తంతో.. హెచ్‌ఐవీ క్యూర్..! భవిష్యత్తులో కీలకంగా కొత్త పద్ధతి
X

దిశ, ఫీచర్స్ : ఎయిడ్స్‌కు కారణమయ్యే ప్రాణాంతక హెచ్‌ఐవీ వైరస్ నుంచి సురక్షితంగా బయటపడ్డ ఒక యూఎస్ పేషెంట్.. ప్రపంచంలోనే మూడో వ్యక్తిగా, మొదటి మహిళగా నిలిచింది. 2017లో లుకేమియా బారినపడ్డ సదరు మహిళ.. సహజ సిద్ధంగా హెచ్‌ఐవీ నిరోధకత కలిగిన డోనర్ నుంచి స్టెమ్ సెల్ మార్పిడి తర్వాత కోలుకుంది. ఈ నెల ప్రారంభంలో డెన్వార్‌లో 'రెట్రోవైరస్‌లు, అవకాశవాద ఇన్‌ఫెక్షన్స్‌'పై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ప్రజెంట్ చేయబడిన ఈ కేసు.. బొడ్డు తాడు రక్తం(umbilical blood cord)తో ముడిపడి ఉన్న చికిత్సకు సంబంధించి మొదటిది. కాగా ఈ కొత్త పద్ధతి HIV చికిత్సను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెస్తుందని వైద్యులు విశ్వసిస్తున్నారు. కాగా బొడ్డు తాడు రక్త మార్పిడి తర్వాత సదరు మహిళకు HIV ఎలా నయమైంది? ఈ పురోగతి భవిష్యత్‌లో ఎలాంటి పాత్ర పోషించనుంది?

HIV ఎలా సంక్రమిస్తుంది?

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ లేదా HIV అనేది ఒక ఇన్‌ఫెక్షన్. ఇది బాడీ లో CD4గా పిలువబడే రోగ నిరోధక కణాలను నాశనం చేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. క్రమంగా శరీరాన్ని బలహీనపరచడం ద్వారా మరిన్ని 'అవకాశవాద అంటువ్యాధులు' పుట్టుకొచ్చేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు రక్తం, వీర్యం, యోని స్రావాలు, మల ద్రవాలతో పాటు తల్లి పాల వంటి బాడీ ఫ్లూయిడ్ HIV కి వాహకాలుగా పనిచేస్తాయి. ఇది సేఫ్టీ లేని శృంగారం, కలుషిత రక్తాన్ని ఎక్కించడం సహా సూదులు, సిరంజిలను షేర్ చేసుకోవడం ద్వారానే కాక ప్రెగ్నెన్సీ టైమ్‌లో HIV గల తల్లుల నుంచి శిశువులకు కూడా సంక్రమిస్తుంది. సాధారణంగా HIV ట్రాన్స్‌మిషన్, AIDS నిర్ధారణకు 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక్కోసారి అంతకంటే ముందే సంభవించవచ్చు.

ఈ చికిత్స గురించి ఏం తెలుసు?

HIV నుంచి సురక్షితంగా బయటపడ్డ 'న్యూయార్క్ పేషెంట్' ఒక మిశ్రమ-జాతి మహిళ. 2013లో హెచ్‌ఐవీ నిర్ధారించబడగా.. వైరస్ లెవెల్స్‌ తగ్గించుకునేందుకు యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. ఇదే క్రమంలో నాలుగేళ్ల తర్వాత ఆమెకు లుకేమియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, క్యాన్సర్ చికిత్సలో భాగంగా.. తనకు హెచ్‌ఐవీ సహజ నిరోధకతను కలిగిన వ్యక్తి నుంచి సేకరించిన బొడ్డు తాడు రక్తాన్ని మార్పిడి చేశారు. ఇక అప్పటి నుంచి ఆమెకు యాంటీ రెట్రో వైరల్ థెరపీ అవసరం లేదని ఈ కేసును స్టడీ చేసిన పరిశోధకులు తెలిపారు. బొడ్డు తాడు నుంచి సేకరించిన రక్తంలో హెచ్‌ఐవీ వైరస్‌ను నిరోధించే మ్యుటేషన్ ఉందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. విశేషమేమిటంటే ఇది పాక్షికంగా సరిపోలిన దాత నుంచి తీసుకోబడింది. అయితే, ఎముక మజ్జను ఉపయోగించి చేసే ట్రాన్స్‌ప్లాంట్స్‌ విషయంలో మాత్రం కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది.

ఎందుకంత ఇంపార్టెన్స్?

ఈ కేసు ఎందుకంత ముఖ్యమనే విషయంలో రెండు కారణాలున్నాయి. ఒకటి.. HIV రోగికి బొడ్డు తాడు రక్త మార్పిడిని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఫలితాలను బట్టి ఇటువంటి చికిత్సా విధానాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని వైద్యులు, పరిశోధకులు సూచించారు. రెండో విషయం.. ఈ క్యాన్సర్ రోగి మధ్య వయస్కురాలైన మిశ్రమ-జాతి మహిళ. ఇక US లో ఎక్కువ మంది డోనర్స్ కాకేసియన్ సంతతికి చెందినవారే కావడం మరో ముఖ్యాంశం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ ట్రీట్మెంట్‌‌కు సంబంధించి పాక్షిక మ్యాచెస్ సరిపోతాయి. కాబట్టి ఇది భిన్న జాతుల నేపథ్యం గల వ్యక్తుల చికిత్సకు అందుబాటులో ఉంటుంది.

మొదటి ఇద్దరు HIV రోగులకు ఎలా నయమైంది?

2007లో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత HIV నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి బెర్లిన్‌కు చెందిన తిమోతి రే బ్రౌన్. రెండో వ్యక్తి లండన్‌కు చెందిన ఆడమ్ కాస్టిల్లెజో. ఇతను 2020లో HIV నుంచి బయటపడ్డాడు. ఈ ఇద్దరు రోగులు కూడా HIV నుంచి రక్షణ కల్పించే అసాధారణ జన్యువును కలిగిన దాతల నుంచి కణ మార్పిడి స్వీకరించారు. అయితే వీరు న్యూయార్క్ రోగి మాదిరి కాకుండా ఎముక మజ్జ మార్పిడి లో భాగంగా పెద్దల మూలకణాలను పొందారు. నిజానికి వయోజన మూలకణాలను కనుగొనడమే చాలా కష్టం కాగా.. బొడ్డు తాడు రక్తం మాత్రం విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

పైగా దాత తో సన్నిహితంగా సరిపోలాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. ఎముక మజ్జ మార్పిడి తర్వాత బ్రౌన్, కాస్టిల్లో జో.. గ్రాఫ్ట్ - వర్సెస్-హోస్ట్ వ్యాధితో సహా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కొన్నారు. కాగా స్టెమ్ సెల్ మార్పిడి పొందిన న్యూయార్క్ రోగి మాత్రం 17 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అంతేకాదు ఆమెకు గ్రాఫ్ట్- వెర్సెస్-హోస్ట్ వ్యాధులు తలెత్తలేదని వైద్యుడు జింగ్‌మీ హ్సు వెల్లడించాడు.



Next Story

Most Viewed