4 ఏళ్ల గరిష్ఠానికి ఇళ్ల అమ్మకాలు!

by Disha Web |
4 ఏళ్ల గరిష్ఠానికి ఇళ్ల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 4 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ నివాస గృహాల మార్కెట్ పుంజుకుందని, 2022 మొదటి త్రైమాసికంలో 9 శాతం పెరిగి మొత్తం 78,627 రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా డిమాండ్ పుంజుకోవడంతో గడిచిన కొన్ని త్రైమాసికాలుగా నివాస గృహాల విభాగం మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికి కీలక మద్దతు ఇస్తోంది.

దీనివల్ల ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోందని, తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థికంగా వినియోగదారుల్లో మార్పులు రావడం కలిసొచ్చాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. సమీక్షించిన త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ కొత్త ఇళ్ల అమ్మకాల్లో 15,019 యూనిట్లతో రెండింతలు పెరిగాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 34 శాతం పెరిగి 13,663 యూనిట్లు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో 35 శాతం పెరిగి 4,105 యూనిట్లు, హైదరాబాద్‌లో స్వల్పంగా 1 శాతం వృద్ధితో 6,993 యూనిట్లు, కోల్‌కతాలో 1 శాతం పెరిగి 3,619 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబై 9 శాతం క్షీణించి 21,548 యూనిట్ల విక్రయాలు, పూణెలో 25 శాతం పడిపోయి 10,305 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. చెన్నైలో 17 శాతం క్షీణించి 3,376 యూనిట్లు అమ్ముడయ్యాయి.


Next Story