కుండపోత వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు

by Muthe.Rajitha |

నైరుతి రుతుపవనాల రాకతో కర్ణాటక వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

కుండపోత వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాల రాకతో కర్ణాటక వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తీరప్రాంతాలు, మల్నాడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా, మిగిలిన అంతర్గత జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ముఖ్యంగా బెళగావి జిల్లాలోని బైల్‌హొంగల్, సౌందత్తి తాలూకాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. బైల్‌హొంగల్‌లో కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 12 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి రోడ్లపై నిలిపి ఉంచిన బైకులు, ఆటోలు కొట్టుకుపోగా.. అనేక నివాస ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మార్కెట్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

బెళగావితో పాటు బాగల్కోట్, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, హాసన్, హుబ్బళ్లి-ధార్వాడ్ ప్రాంతాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుంగ జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో రవాణా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు, అండర్‌పాస్‌లు జలమయమవడంతో బెంగళూరు సహా పలు నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలు జారీ చేశారు. రాబోయే మరికొన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story