ఆగస్టు 8,9 తేదీల్లో భారీ వర్షం.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

by Dishafeatures2 |
ఆగస్టు 8,9 తేదీల్లో భారీ వర్షం.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నదని, ఈ నెల 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 8, 9 తేదీల్లో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ కారణంగానే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో మాత్రమే కాక చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదలు రాజస్థాన్ వరకు వ్యాపించిందని తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాలు మరింత తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించిన వాతావరణ కేంద్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను, ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది. పంటలు నీట మునుగుతాయని, విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడుతుందని, రైలు-రోడ్డు వ్యవస్థ దెబ్బతింటుందని, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని, వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించింది. స్థానిక సంస్థలు ప్రజలను హెచ్చరికల ద్వారా అప్రమత్తం చేసి కదలికలను నియంత్రించుకోవాల్సిందిగా చూడాలని సూచించింది. రోడ్డు-రైలు వ్యవస్థకు సంబంధించి కూడా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా రెండు రోజులుగా రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెం.మీ., సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో 9.0, జనగాం జిల్లా గూడూరులో 8.2, జగిత్యాల జిల్లా నేరెళ్ళలో 8.0, కొత్తగూడెం జిల్లా కరకుగూడెంలో7.6, నల్లగొండ జిల్లా తడకమళ్ళలో 7.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాల మినహా రాష్ట్రమంతా సగటుకంటే 60%కి పైగా ఎక్కువ వర్షం కురిసినట్లు ప్లానింగ్ సొసైటీ తాజా బులెటిన్‌లో పేర్కొన్నది. గడచిన 24 గంటల్లోని వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని పరిగిలో 16.1 సెం.మీ., తాండూరులో 15.2, మంచిర్యాలలో 15.2, గంగాధరలో 12.7 సెం.మీ. చొప్పున వర్షం కురిసినట్లు పేర్కొన్నది.


Next Story

Most Viewed