- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చింతలమానేపల్లిలో ఉద్రిక్తత : ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం కర్జెల్లి బీట్ పరిధిలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొందరు రైతులు అటవీశాఖ వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో రైతులను అదుపులోకి తీసుకుని కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయానికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో అటవీశాఖ సిబ్బందితో పాటు భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గత నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
విచక్షణారహితంగా తమపై దాడి చేశారని పోడు రైతుల ఆరోపణ..
మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఫారెస్ట్ అధికారులు తమ పై విచక్షణారహితంగా దాడి చేసి, కొట్టి, అక్రమంగా వాహనాల్లో ఎక్కించి కాగజ్‌నగర్‌కు తరలించారని పోడు రైతులు ఆరోపించారు. తమ తాతముత్తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ఉన్న భూములను లాక్కుంటే తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని పోడు రైతులు తెలిపారు.
తాము ఎవరిపైనా దాడి చేయలేదు : కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్య
చింతలమానేపల్లి మండలం కర్జెల్లి రేంజ్ పరిధిలో సుమారు 31 శాతం అటవీ భూమి ఆక్రమణకు గురైందని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్య తెలిపారు. దిందా ప్రాంతంలో 1,600 ఎకరాల భూమి ఆక్రమణలో ఉండగా, తాత్కాలికంగా 800 ఎకరాల్లో స్థానిక రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి నాలుగు ఎకరాల చొప్పున పోడు సాగు చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. మొక్కలు నాటేందుకు వెళ్లిన తమను రైతులు అడ్డుకున్నారని, నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలను కూడా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో కొందరు రైతులను అదుపులోకి తీసుకుని కాగజ్‌నగర్ రేంజ్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం ఇళ్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.






