కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి!

by Dishanational1 |
కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి!
X

చండీగఢ్: రెండు రోజుల పాటు జరుగుతున్న సమావేశంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు వస్తువులపై పన్ను రేట్లను సవరించడంతో పాటు కొన్ని వస్తువులపై పన్ను మినహాయింపులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మొదటిరోజు, పన్నుల హేతుబద్దీకరణ, డ్యూటీ విధానాలను సరళీకృతం చేసే అంశాలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం నివేదికను ఆమోదం తెలిపింది. ఇందులో బంగారం, విలువైన రాళ్ల అంతర్‌రాష్ట్ర రవాణాపై ఈ-వే బిల్లులను జారీ చేయడానికి రాష్ట్రాలను అనుమతించింది. విలువ ఎంత మొత్తం దాటితే ఈ-వే బిల్లులను జారీ చేయాలి అనే అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సూచించగా, మంత్రుల బృందం దాన్ని రూ. 2 లక్షలుగా నిర్ణయించాలని ప్రతిపాదనలు చేసింది.

అలాగే, ఆతిథ్య రంగం సహా ఇతర సేవల రంగంలోని వివిధ సేవలపై ఇస్తున్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. రోజుకు రూ. వెయ్యి కంటే తక్కువ ఛార్జ్ చేసే హోటల్ వసతిని 12 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ఇదివరకు దీనిపై ఎలాంటి జీఎస్టీ వసూలు చేయడం లేదు. అదేవిధంగా ఆసుపత్రులలో రోగులు చికిత్స పొందే రూ. 5,000 కంటే ఎక్కువ ధర ఉండే గదులపై 5 శాతం జీఎస్టీ అమలు కానుంది. పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్స్, ఎన్వలప్(1ఒ గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటే), బుక్‌పోస్ట్లు మినహా అన్ని రకాల పోస్టల్ సేవలపై జీఎస్టీ అమలు కానుంది.

చెక్కులపై 18 శాతం జీఎస్టీని కౌన్సిల్ ప్రతిపాదించింది. వ్యాపార సంస్థలకు చెందిన నివాస సముదాయాల అద్దెలపై, ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్ ప్రయాణంపై ఉన్న రాయితీని మండలి ఉపసంహరించుకుంది. వ్యాపార సంబంధమైన జంతువధశాలలకు ఇస్తున్న మినహాయింపును తొలగించారు. వ్యవసాయ ఉత్పత్తులు పాడు కాకుండా పొగ వేయడం, గోడౌన్‌లలో ఉంచే గింజలు, చెరకు, బెల్లం, పత్తి, కూరగాయలు, పూర్తిగా తయారవని పొగాకు, వక్క, కాఫీ, టీ ఉత్పత్తులపై జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇక, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులపై సేవా పన్నును మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ మండలి సూచించింది. పెట్రోలియం, బొగ్గు ఆధారిత వస్తువులు, పరికరాలపై 12 శాతం పన్ను అమలు కానుంది.


Next Story

Most Viewed