హాట్సాఫ్ రియల్ పోలీస్.. ప్రజాప్రతినిధుల పైరవీల బుట్టదాఖలు

by Dishafeatures2 |
హాట్సాఫ్ రియల్ పోలీస్.. ప్రజాప్రతినిధుల పైరవీల బుట్టదాఖలు
X

దిశ, రఘునాథపల్లి: చాలా రోజుల తర్వాత పోలీస్ శాఖలో నికార్సైన ఓ అధికారిని చూశాం.. ఇలాంటి ఆఫీసర్ జిల్లాకు ఒకరుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మాటలంటున్నది రఘునాథపల్లి మండలానికి చెందిన సామాన్య జనం. ఇదంతా అక్కడ పనిచేస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ పరితోష్ గురించి. ఆయన బీహార్ రాష్ట్రానికి చెందిన వారు కాగా. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌కి ఎంపికైన ఈయన తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా రెండున్నర నెలలు అవుతుంది. అయితే పోలీస్ శాఖలోని వివిధ దశల శిక్షణలో భాగంగా ఆయన రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో పూర్తి కాలపు హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి పోలీస్ శాఖలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సరిగ్గా మూడు పదుల వయసులో ఖాకీ యూనిఫాం వేసిన పంకజ్ పరితోష్ పేద ప్రజల సాధకబాధకాలు వినడంలో ఆయన ఓపికే వేరు. అంతేకాకుండా విధులు నిర్వర్తించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎవరైనా సరే కేసు పెట్టడం పక్కా అన్న రీతిలో డ్యూటీ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొంచకుండా తన విధులు నిర్వర్తించారు.

తగ్గిన కేసులు:

ఇక్కడ ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. అనే భావన మండల ప్రజల్లో కలిగింది. భూ తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, చీటింగ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గింది. నేరస్తులు అవతలి వ్యక్తులతో రాజీ కుదుర్చుకున్న కేసులు లేకపోలేదు.

సబ్ గలీజు దందా బంద్ కియా:

రియల్ ఎస్టేట్ మోసాలు, ఇసుక అక్రమ రవాణా, గుట్కా వ్యాపారం మట్కా, జూదం, ఇలా అనేక అక్రమ గలీజు వ్యాపారాలు అన్నీ ఈయన వచ్చాక బంద్ అయ్యాయి. గుట్కా ప్యాకెట్ల అమ్మకాలు, ఇసుక వ్యాపారం చేపట్టాలని చూస్తే కేసులు పెట్టి జైలుకు పంపారు. దీంతో చాలా మంది ఈ దందాను వదిలేశారు. ఏకంగా మంత్రి దయాకర్ రావు పేరు చెప్పుకునే సర్పంచుల ఫోరం జిల్లా నాయకుడి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని కోర్టులో రిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక అధికార పార్టీ మహిళా సర్పంచ్ కుటుంబ సభ్యులపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సదరు కుటుంబంతో పరారీలో ఉన్నారు. అంతటితో ఆగకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన,హెల్మెట్ లేకుండా బైకులు నడిపే వారిని సైతం వదలకుండా జైలు ఊచలు లెక్కించడం జరిగింది. అనేక గ్రామాల్లో సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇలా అనేక రకాల సమస్యలు ఆయన తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టించాడు. దీంతో పోలీస్ ఉంటే ఇలా ఉండాలి అని చాలామంది అంటున్నారు. దీంతో నిజమైన పోలీస్ అనిపించారు. అందుకే అదురు సెల్యూట్ పోలీస్ అంటున్నారు.

వారం రోజుల్లో బదిలీ..

ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మరో వారం రోజుల్లో ఇక్కడి నుండి బదిలీ అవుతున్నారు. దీంతో చాలా మంది ఆయన ఇక్కడ మరికొంత కాలం ఉంటే బాగుండేది అని అంటున్నారు.


Next Story

Most Viewed