ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగిన బంగారం ధర!

by Web Desk |
ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగిన బంగారం ధర!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక కష్టాలు ఎప్పుడొచ్చిన ఆశగా అందరిచూపు బంగారంపైనే ఉంటుంది. కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లు సహా అన్ని రకాలుగా ఇబ్బందులొచ్చిన సమయంలో అందరూ బంగారంపై పెట్టుబడులను మళ్లించారు. ఇప్పుడు మళ్లీ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురుతో పాటే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్న పరిణామాల మధ్య గ్లోబల్ మార్కెట్లలో పసిడి ప్రియం కావడం, మన దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా క్షీణిస్తుండటంతో దేశీయంగా బుధవారం పసిడి ధరలు భగ్గుమన్నాయి. బుధవారం సాయంత్రం సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,090 పెరిగి రూ. 52,040కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. వెయ్యి పెరిగి రూ. 47,700గా ఉంది. వెండి కూడా ఇదే స్థాయిలో కిలోకు రూ. 2,100 పెరిగి రూ. 72,100కు చేరుకుంది. ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలను గమనిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 52,040 ఉండగా, చెన్నైలో రూ. 53,240గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,943 డాలర్ల వద్ద ఉంటే, వెండి ఔన్స్ ధర 25.18 డాలర్లుగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అమెరికాలో రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, దేశీయంగా రూపాయి బలహీనత వంటి కారణాలతోనే బంగారం ధరలు పెరుగుతుందని విశ్లేషకులు వెల్లడించారు.


Next Story