కిసాన్ సమ్మాన్‌లో వారికి ఛాన్స్ ఇవ్వండి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్

by Disha Web |
కిసాన్ సమ్మాన్‌లో వారికి ఛాన్స్ ఇవ్వండి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్త వారు కూడా నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేవలం 35.74 లక్షల మందికి మాత్రమే అందుతుందని, దీనికింద ఇప్పటివరకు అందింది కేవలం రూ.7,689 కోట్లు మాత్రమేనన్నారు. కాగా రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.50వేల కోట్లు అందగా, 9వ విడతతో అది రూ.58వేల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు.

కిసాన్ సమ్మాన్ పథకంలో 2019 ఫిబ్రవరి 1 తరువాత నుంచి ఇప్పటివరకు కొత్తవారికి అవకాశం ఇవ్వకపోగా, 2024వరకు అవకాశం లేకుండా చేశారన్నారు. ఆదాయ పన్ను కట్టినా, రూ.10వేల పింఛన్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారితో పాటు మరికొంత మందికి ఈ పథకాన్ని వర్తింపజేయడంలేదని తెలిపారు. ఇంతమందిని కేంద్రం అనర్హులుగా గుర్తించినా తెలంగాణ బీజేపీ నేతలు ఈ పథకం అందరికీ వర్తించేలా ఎందకు కృషి చేయరంటూ ప్రశ్నించారు. కేంద్రం అడ్డగోలు నిబంధనలతో ప్రతీ విడతలో సుమారు 30 లక్షల మంది రైతులు కిసాన్ పథకానికి దూరంగా ఉంటున్నారన్నారు. బీజేపీ నేతలు సుద్దులు చెప్పడం మానేసి, పీఎంకి చెప్పి ప్రతీ రైతుకూ పథకం వర్తింపజేయాలని అన్నారు. కాగా కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలు తగ్గిస్తూ, రైతుల నడ్డి విరుస్తున్నదని ధ్వజమెత్తారు.

Next Story