భారీ విరాళం ప్రకటించిన అదానీ కుటుంబం!

by Disha Web |
భారీ విరాళం ప్రకటించిన అదానీ కుటుంబం!
X

న్యూఢిల్లీ: దేశీయంగానే కాకుండా ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి భారీ విరాళం ప్రకటించారు. వివిధ సామాజిక కార్యక్రమాలకు రూ. 60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం అదానీ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు అదానీ ఫౌండేషన్ ఈ మొత్తాన్ని వినియోగించనుంది.

జూన్ 24(శుక్రవారం)తో గౌతమ్ అదానీకి 60 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా అదానీ కుటుంబం సామాజిక కార్యక్రమాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. భారత కార్పొరేట్ చరిత్రలో ఓ ఫౌండేషన్‌కు జరిగిన అతిపెద్ద బదిలీగా ఇది నిలుస్తుందని, అలాగే గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా ఇదే ఏడాది కావడంతో భారీగా దాతృత్వ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల కోసం మూడు కమిటీలను నియమిస్తున్నామని, విరాళాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనే దానిపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని గౌతమ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కమిటీల్లో అదానీ కుటుంబ సభ్యులు సహాయక సభ్యులుగా ఉంటారన్నారు.

కాగా, భారతీయ వ్యాపారంలోకి 1988లో ప్రవేశించిన గౌతమ్ అదానీ గత మూడు దశాబ్దాలకు పైగా పలు కీలక రంగాల్లో రాణించారు. ముఖ్యంగా కొన్నేళ్లలో మరింత వేగంగా అనేక రంగాల్లోకి అదానీ వ్యాపారాలు విస్తరించాయి. ఇక, కొవిడ్-19 మహమ్మారి మొదలైన 2020 తర్వాత అత్యంత వేగంగా వ్యాపారాలను విస్తరించిన గౌతమ్ అదానీ ఇటీవల ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొదటి పది మందిలో చోటు సంపాదించారు.

Next Story