గంజాయి ముఠా అరెస్ట్.. 1.5 కిలోల గంజాయి స్వాధీనం

by Batti.Sumithra |

హుజూర్‌నగర్ పట్టణ శివారులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా పై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

గంజాయి ముఠా అరెస్ట్.. 1.5 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, హుజూర్‌నగర్ టౌన్ : హుజూర్‌నగర్ పట్టణ శివారులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా పై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం, హుజూర్‌నగర్ పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద కొందరు వ్యక్తులు గంజాయిని స్వీకరించి ఇతరులకు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ చలిగంటి నరేష్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి సుమారు 1.5 కిలోల గంజాయి, ఒక స్కూటీ, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కొప్పుల శ్రీకాంత్ గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతానికి చెందిన మెహన్ ద్వారా గంజాయిని తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో హుజూర్‌నగర్ పట్టణ శివారులోని పరకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో గంజాయి అమ్మకాలు, వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ నరేష్ తన సిబ్బందితో మాటువేసి అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన కొప్పుల శ్రీకాంత్ (పాండు) గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి సేవించడం, కొనుగోలు చేయడం, పట్టణంలోని తన స్నేహితులకు విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. గతంలో అతని పై రెండు గంజాయి కేసులు, రెండు దొంగతనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. శ్రీకాంత్ తన స్నేహితులైన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కాసాని సాయికృష్ణ, ఖమ్మం పట్టణానికి చెందిన దూరు సందీప్‌లకు గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే హుజూర్‌నగర్, ఖమ్మం ప్రాంతాల్లోని ఇతరులకు కూడా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడిన నిందితులు:

కొప్పుల శ్రీకాంత్ (పాండు)

కాసాని సాయికృష్ణ

దూరు సందీప్

డెరంగుల వాసు

గంగాధరి అభిరామ్

సత్తి అరవింద్ సింగ్

నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అక్రమ కార్యకలాపాల పై 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ కోరారు. గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ నరేష్, కానిస్టేబుళ్లు నాగరాజు, శంభయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story