నేను అనుకుంటే సీఎం అయిపోతా.. గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web |
నేను అనుకుంటే సీఎం అయిపోతా.. గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అతనో మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, కర్ణాటక రాజకీయాల్లో అతి ముఖ్యమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వాడు. అలాంటి వ్యక్తి గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఇంతలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆయన ఆ మాటలు ఫ్లో లో అనేశాడా లేక ఉద్దేశపూర్వకంగానే ఆ కామెంట్స్ చేశారా అనేది ఆసక్తిగా మారింది. అతనెవరో కాదు గాలి జనార్ధన్ రెడ్డి. ఒబులాపురం మైన్స్ కింగ్‌గా పేరుగాంచిన గాలి బ్రదర్స్‌లో ఒకరు గాలి జనార్ధన్ రెడ్డి. 2008 నాటి కర్ణాటక సీఎం యడ్యూరప్ప అప్పటి ఏపీ సీఎ వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలతో యథేచ్చగా అక్రమంగా మైనింగ్స్‌కు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

నిబంధనలకు విరుద్ధంగా పర్యవరణ అనుమతులను తుంగలోకి తొక్కి మైనింగ్ చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. పలు ఆరోపణల్లో కొంత కాలం జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల బళ్లారిలో తన తమ్ముడైన గాలి సోమశేఖర్ రెడ్డి 57వ జన్మదిన వేడుకల్లో జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా:

తనకు గాని తన సోదరుడికి గాని డబ్బుపై ఆశలేదన్నారు. అలాగే గాలి జనార్ధన్ రెడ్డి తన ప్రాణ స్నేహితుడిగా చెప్పబడుతున్న శ్రీరాములు (కర్ణాటక మంత్రి)కు సైతం మనీ పట్ల ఆశలేదని అన్నారు. తనకు ఎమ్మెల్యే, మంత్రి కావాలే ఆశలేదన్నారు. ఒకవేళ తనకు అలాంటి ఆశలు ఉంటే ఒక్కరోజు అయినా సీఎం అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీబీఐపై బాంబు పెల్చారాయన. తనను ఇబ్బందులు పెట్టాలని కొందరు అనుకున్నారని ఈ విషయాన్ని సీబీఐ ఆఫీసర్లే తనతో చెప్పారని పేర్కొన్నాడు. తాను అనుకుంటే సీఎం అవుతానని గాలి జనార్ధన్ రెడ్డి చెప్పిన వెంటనే అక్కడున్న వారంతా ఆయనపై పూల వర్షం కురిపించారు.

అవి 'గాలి' మాటలు కావా?

పదవుల విషయంలో సెన్షేషన్ కామెంట్స్ చేసిన జనార్ధన్ రెడ్డి యధాలాపంగా అన్న మాటలు కావనే టాక్ వినిపిస్తోంది. అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో బీజేపీ తరపున యాక్టీవ్ పొలిటీషియన్‌గా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఆ తర్వాత పార్టీలో సరైన గుర్తింపు లేదనే వాదన ఉంది. అతడు తమ పార్టీ వాడే అని బహిరంగంగా చెప్పుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. అయితే ప్రస్తుతం కార్ణాటక ప్రభుత్వంలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంత కాలంగా వినిపిస్తోంది. యడ్యూరప్పను పక్కన పెట్టిన అధిష్టానం బసవరాజు బొమ్మైకి సీఎం కుర్చీని అప్పగించింది. అతడిని సైతం త్వరలో మార్చబోతున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరాములుకు ఫేవర్‌గా నిర్ణయాలు ఉండాలనేది గాలి జనార్ధన్ రెడ్డి మాటల్లోని సారాంశంగా తెలుస్తోంది. అందువల్లే తాను అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా అవగలనని హింట్ ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది.

Next Story