తెల్లారేసరికి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేలమట్టం

by Disha Web Desk 12 |
తెల్లారేసరికి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేలమట్టం
X

దిశ, ఎల్బీనగర్: నగరానికి తలమానికంగా నిలిచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెల్లారేసరికి నేలమట్టమైంది. నామరూపాలు లేకుండా చరిత్రలో కలిసిపోయింది. గత 160 రోజులుగా వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు గండికొట్టారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా ఫ్రూట్ మార్కెట్ ను కూల్చివేశారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరవాలంటూ మార్కెటింగ్ శాఖకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 4వ తేదీన ఫ్రూట్ మార్కెట్ ను అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. ఇంతలోనే మూడు రోజులు గడవక ముందే మార్కెట్ ను కూల్చివేతలు చేపట్టారు.

అర్ధరాత్రి హైడ్రామా

గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేసేందుకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుము మార్కెట్ ను స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి లాఠీచార్జి

మార్కెటింగ్ శాఖ అధికారులు ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతలు చేపడుతున్నారని తెలుసుకున్న వ్యాపారులు భారీగా తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉదయం 4 గంటల నుండి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్టును నేలమట్టం చేశారు.

చరిత్రలో..

నగరానికే తలమానికంగా నిలిచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ చరిత్ర లో కలిసి పోయింది. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రజల కోసం 18 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఇక్కడే తమ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు ఫ్రూట్ మార్కెట్ ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తూ వస్తుంది. 2020 లో మార్కెట్ ను కోహెడకు తరలించింది. అక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన షెడ్లు నేల కూలాయి. దీంతో తిరిగి ఫ్రూట్ మార్కెట్ ను గడ్డి అన్నారం కి తరలించారు.

ఇక గత ఏడాది ఏప్రిల్ నెలలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు. అప్పటి నుంచి మార్కెట్ ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ.. చివరికి మార్కెట్ ను పూర్తిగా మూసివేశారు. దీంతో వ్యాపారులు తమకు కోహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించకుండా తరలిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు ఫ్రూట్ మార్కెట్ ను తెరువాలంటూ వ్యాపారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. హై కోర్టు ఉత్తర్వులతో ఈ నెల 4న మార్కెట్ ను తెరిచిన అధికారులు మూడు రోజులు తిరగకుండానే హై కోర్టు ఉత్తర్వులని లెక్క చేయకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.



Next Story

Most Viewed