వరుస ఆరు నెలల తర్వాత సానుకూలంగా విదేశీ పెట్టుబడులు!

by Disha Web |
వరుస ఆరు నెలల తర్వాత సానుకూలంగా విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఆరు నెలల పాటు నిధులను వెనక్కి తీసుకెళ్లిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఎట్టకేలకు ఏప్రిల్‌లో కొనుగోళ్లు నిర్వహించారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు ధోరణి నెలకొనడంతో ఎఫ్‌పీఐలు సమీక్షించిన నెలలో రూ. 7,707 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేస్తున్నారని, రానున్న రోజుల్లో వారి కొనుగోళ్ల ధోరణిని బట్టి మార్కెట్లలో నిధులను ఇన్వెస్ట్ చేయనున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

ఇక, రుణాల మార్కెట్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 8,705 కోట్ల నిధులను వెనక్కి తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు, ఏప్రిల్‌లో తిరిగి రూ. 1,403 కోట్ల నిధులను డెట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. కాగా, గతేడాది అక్టోబర్ నుంచి 2022, మార్చి వరకు ఆరు నెలల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ. 1.48 లక్షల కోట్ల భారీ నిధులను ఉపసంహరించుకున్నారు. ప్రధానంగా అమెరికా ఫెడ్ రేట్ల పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల వల్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. అయితే, ప్రస్తుత నెలలో ఇప్పటివరకు మార్కెట్లకు నిధులు వచ్చినప్పటికీ, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో నిర్వహించే అవకాశం లేదని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చుఒహాన్ చెప్పారు.

Next Story

Most Viewed