మాజీ ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు.. ఆధారాలతో సహా బయటపెడతామంటున్న పోలీసులు!

by Disha Web Desk 2 |
మాజీ ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు.. ఆధారాలతో సహా బయటపెడతామంటున్న పోలీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కోడి పందాల నిర్వహాణ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం చిన్నకంజర్లలో కోళ్ల పందాల స్థావరంపై పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తప్పించుకు పారిపోయారని కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన చింతమనేని కోడిపందాల నిర్వహాణలో తాను లేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందని రివర్స్ ఎటాక్ చేశారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా అంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలపై పటాన్ చేరు డీఎస్పీ భీమ్ రెడ్డి స్పందించారు.

కథ నడిపిందే చింతమనేని:

చింతమనేని వ్యాఖ్యలను డీఎస్పీ భీమ్ రెడ్డి ఖండించారు. ఓ మామిడి తోటలో కోడి పందాలు నిర్వహించారని, ఈ కేసులో మెయిన్ ఆర్గనైజర్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారని చెప్పారు. మా టీమ్ మఫ్టీలో రైడ్స్ నిర్వహించినప్పుడు ఆయన అక్కడి నుండి తప్పించుకుని పారిపోయారని వివరించారు. మిగతా ఆర్గనైజర్లు సైతం చింతమనేని పేరును చెప్పారు. సోషల్ మీడియా ద్వారా చింతమనేని చేస్తున్న వ్యాఖ్యలకు తాము ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం. కోడి పందాలు ఆడిస్తున్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. చింతమనేనితో పాటు మరో 40 మంది పరారీలో ఉన్నారు. వీరందరినీ పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు.. చింతమనేని పెట్టిన పోస్టింగ్‌పై త్వరలో మేమూ వీడియో రిలీజ్ చేస్తామని డీఎస్పీ భీమ్ వివరించారు. బీదర్‌లో కోడి పందాలు ఆడిస్తుండగా అక్కడి పోలీసులు వెంట పడటంతో ఇక్కడ వచ్చి ఆర్గనైజ్ చేసినట్లు భీమ్ రెడ్డి తెలిపారు.

అయితే చాలా కాలంగా ఈ కోడిపందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జూదంపై పోలీసుల రైడ్ నిర్వహించి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పరాయ్యారు. పరారైన వారిలో చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరికొంత వీఐపీలు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. పోలీసుల దాడిలో నిందితుల నుంచి 13 లక్షల నగదు, 26 వాహనాలు, 32 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చింతమనేని పేరు ప్రధానంగా వినిపించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో రజకీయంగా చర్చకు దారి తీస్తోంది. మొత్తంగా చింతమనేని వ్యవహారం తెలంగాణ,ఏపీ మధ్య రాజకీయ చిచ్చుగా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed