ప్రైవేట్ మెడికల్ కాలేజీల బలవంతపు వసూళ్లు!

by Muthe.Rajitha |

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన మెడికల్ కాలేజీలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రైవేట్ మెడికల్ కాలేజీల బలవంతపు వసూళ్లు!
X

దిశ, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన మెడికల్ కాలేజీలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. యూనివర్సిటీ సర్క్యులర్లను లెక్కలోకి తీసుకోకుండా బ్యాంకు గ్యారెంటీలకోసం ఇచ్చిన చెక్కులను అక్రమంగా వాడుకుంటూ విద్యార్థులను బ్లాక్ మేయిల్ కు పాల్పడుతున్నాయి. వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తూ ప్రత్యేక పద్ధతులను అవలంభిస్తున్నాయి. ప్రశ్నించిన మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మా విధానాలు మావి అంటు హెచ్చరిస్తున్నాయి. మెడికల్ కాలేజీ యాజమాన్యాల బలవంతపు వసూళ్లతో విసిగివేసారిన మెడికల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు.

ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకోవాల్సిన మెడికల్ కాలేజీ యాజామాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం నాలుగున్నర సంవత్సరాలకు ఫీజు తీసుకోవాల్సి ఉండగా ఐదు సంవత్సరాల ఫీజును వసూల్ చేస్తున్నాయి. దీంతో బీ కేటగిరీ విద్యార్థులకు రూ. 6లక్షలు, సీ కేటగిరీ విద్యార్థులకు రూ.12 లక్షలు అదనంగా వసూళ్లు చేయడంతో విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. ఫీ రెగ్యులేటరీ కమిటీ జీవో సైతం నాలుగున్నరేళ్లకే ఫీజులు తీసుకోవాలని ఉన్నా యాజమాన్యాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

బ్యాంకు గ్యారంటీ చెక్కులతో బ్లాక్ మెయిల్

ఎంబీబీఎస్ ఫీజుల వసూలు పై ప్రభుత్వం జీవో 106 విడుదల చేసింది. నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలని ఏప్రిల్ 21న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేసింది అయినప్పటికీ అవేమి పట్టని ప్రతిమ మెడికల్ కాలేజీ, చల్మెడ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. చెల్లించని మెడికల్ విద్యార్థుల బ్యాంకు గ్యారెంటీ చెక్కులను వాడుతూ బ్లాక్ మేయిల్ కు పాల్పడుతున్నాయి. లీగల్ నోటీసులు జారీ చేస్తూ విద్యార్థుల పరీక్ష హాల్ టికెట్స్ జారీచేయకుండా వేధింపులకు పాల్పడుతున్నాయి. మెడికల్ కాలేజీలో బలవంతపు వసూళ్లతో విసిగి వేసారిన విద్యార్థుల తల్లితండ్రులు కాళోజి హెల్త్ యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. పైగా మా పద్ధతులు ఇంతే మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టుగా యాజమాన్యాలు వ్యవహరించడం పై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆందోళన బాటపట్టిన మెడికో పేరెంట్స్

చల్మెడ మెడికల్ కాలేజ్, ప్రతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం బలవంతపు వసూళ్లపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ గా ఏర్పడి ఆందోళన బాటపట్టాయి. దీంతో కరీంనగర్ లో వివిధ కళాశాలలకు చెందిన మెడికో పేరెంట్స్ క్యూ కట్టారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన జీవోలను కాదని ఫీజుల వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బలవంతపు వసూళ్లను నిలిపివేయాలంటూ మెడికల్ కాలేజి యాజమాన్యాలను డిమాండ్ చేశాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాల్గున్నరేళ్లకుగాను ఐదేళ్లల్లో ఐదు విడతల్లో ఫీజులు కట్టేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిబంధనలు ఉన్నాయని ఇంటర్​షిప్ తో కలిసి ఐదున్నరేళ్ల కోర్సులో ఏడాది ఇంటర్నిషిప్​లో మెడికోలకు స్టైపండ్ ఇచ్చి పని చేయించుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఆ ఇంటర్నిషిప్​ సమయానికీ అదనంగా ఫీజులు వసూళ్లు చేయడంపై పేరెంట్స్​మండిపడుతున్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు సమాంతర సర్కార్ లా మారిపోయి బెదిరిస్తున్నాయని మెడికోల తల్లిదండ్రులు వాపోతున్నారు..గట్టిగా అడిగితే విద్యార్థులను ఫెయిల్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఫీజుల వసూళ్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికీ, యూనివర్సిటీ వీసీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story