రెండు రాష్ట్రాలపై కేఏ పాల్ ఫోకస్.. సరికొత్త నినాదంతో ప్రజలకు బంపరాఫర్!

by Disha Web Desk 2 |
రెండు రాష్ట్రాలపై కేఏ పాల్ ఫోకస్.. సరికొత్త నినాదంతో ప్రజలకు బంపరాఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రూటు మార్చారు. నిన్నా మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటుతానని, సీఎం కేసీఆర్‌ను గద్దెదింపుతానని హడావుడి చేసిన పాల్.. సడెన్‌గా ఏపీ రాజకీయాలపై పడ్డారు. జగన్ సర్కార్‌పై గురి పెట్టారు. పార్టీని గెలిపించడానికి ఇదే చివరి అవకాశం అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా సరికొత్త నినాదాన్ని ఎత్తుకోవడంతో ఆయన మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. 'పాల్ రావాలి పాలన మారాలి' అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో యాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్, జగన్ సర్కార్ల లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరుస పర్యటనలకు షెడ్యూల్ విడుదల చేయడం చర్చనీయాంశం అవుతోంది.

రెండు రాష్ట్రాలపై కన్నేసిన పాల్:

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన కేఏ పాల్.. ఈసారి తెలంగాణలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని ప్రకటించారు. రెండు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనల ద్వారా పొలిటికల్ హీట్ పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. తొలుత ఏపీలో జులై 9న తన పర్యటన ప్రారంభం కానుందని కేఏ పాల్ వివరించారు. జులై 9న వైజాగ్, 10న విజయనగరంలో పర్యటించబోతున్నాని, జులై 23 నుండి ఆగస్ట్ 1 వరకు తెలంగాణలో టూర్ ఉంటుందని వివరించారు.

ప్రజలకు బంపరాఫర్:

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాయని ఇటీవల కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌పై ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చారు. జగన్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు తనకే ఉందని అంటున్న కేఏ పాల్.. తెలంగాణలో 70 శాతం ప్రజలు ప్రజా శాంతివైపు మొగ్గుచూపుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అయితే మిగతా 30 శాతం మంది తనపట్ల ఎందుకు నమ్మకంగా లేరో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఎవరైనా సరే తమ సమస్యలను తనతో నేరుగా చెప్పుకోవచ్చని బంపరాఫర్ ఇచ్చారు. తన యాత్రకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఫోన్‌లో కోరానని అందుకు ఆయన అంగీకరించినట్లు పాల్ వివరించారు. రెండు రాష్ట్రాల్లో పర్యటనలకు సంబంధించిన టూర్లు ఖరారు కావడంతో ఈ యాత్రల ద్వారా కేఏ పాల్ ఏ మేరకు ప్రభావాన్ని చూపుతారనేది ఆసక్తిగా మారింది.


Next Story

Most Viewed