ఈ నెల 23న ప్రభుత్వ రంగ బ్యాంకులతో నిర్మలా సీతారామన్ సమావేశం!

by Disha Web Desk 13 |
ఈ నెల 23న ప్రభుత్వ రంగ బ్యాంకులతో నిర్మలా సీతారామన్ సమావేశం!
X

న్యూఢిల్లీ: బ్యాంకుల పనితీరు, పురోగతిని సమీక్షించేందుకు ఈ నెల 23న ప్రభుత్వం రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలపై బ్యాంకుల పనితీరు, సాధించిన పురోగతిపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రకటించిన అనంతరం జరుగుతున్న మొదటి సమావేశం ఇది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను మరింత వేగవంతం చేసేందుకు ఉత్పాదక రంగాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి కోరినట్టు తెలుస్తోంది.

అలాగే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ఈసీఎల్‌జీఎస్)తో పాటు పలు విభాగాలు, ప్రభుత్వ పథకాల పురోగతిని నిర్మలా సీతారామన్ సమీక్షించనున్నారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈసీఎల్‌జీఎస్‌ను 2023, మార్చి వరకు పొడిగించారు. అలాగే, ఈ పథకం కోసం హామీ మొత్తాన్ని రూ. 50,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు పెంచారు. ఇంకా, ఆతిథ్య, ప్రయాణ, పర్యాటక, పౌర విమానయాన రంగాలకు ఈసీఎల్‌జీఎస్ 3.0 కింద ప్రయోజనాలను పెంచడం, విస్తరించడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈ అంశాలను సమావేశంలో నిర్మలా సీతారామన్ సమగ్రంగా సమీక్షించనున్నారు.


Next Story

Most Viewed