కొలంబియా జైలులో దాడులు.. 50 మంది ఖైదీలు మృతి

by Dishafeatures2 |
కొలంబియా జైలులో దాడులు.. 50 మంది ఖైదీలు మృతి
X

కొలంబియా: కొలంబియా తులువా నగరంలోని జైలులో ఖైదీల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో 51 మంది చనిపోయారు. కొలంబియా చరిత్రలో అత్యంత ఘోర సంఘటనల్లో ఒకడిగా భావిస్తున్న ఈ దుర్ఘటనలో సోమవారం రాత్రి ఖైదీలు నిరసన తెలుపుతూ తలగడలకు నిప్పు అంటించారని నేషలన్ ప్రిజన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జెన్ టిటో తెలిపారు. జైలులో ఖైదీల మధ్య దాడి చోటు చేసుకుందని, కొంతమంది ఖైదీలు తలగడలకు నిప్పు పెట్టడంతో అది బ్యారక్‌లకు వ్యాపించిందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటనలో 49 మంది ఖైదీలు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారని పేర్కొన్నారు. మరో 30 మది ఖైదీలు గాయపడ్డారని, డజన్ల కొద్దీ ఖైదీలను అసుపత్రికి తరలించామని చెప్పారు.

కొలంబియా వాయవ్య ప్రాంతంలోని ఈ నగరంలోని జైలులో 1,267 మంది ఖైదీలు ఉంటున్నారు. నిప్పు అంటుకున్న బ్లాక్‌లో 180 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు చెప్పారు. కొలంబియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను కుక్కేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 81 వేలమంది పట్టే సామర్థ్యం ఉన్న జైళ్లలో 97 వేల మంది ఖైదీలను కుక్కారని గణాంకాలు చెబుతున్నాయి. జైళ్లు కిక్కిరిసిపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో 2020లో కూడా కొలంబియా జైళ్లలో చెలరేగిన నిరసన ఘటనల్లో 20 మంది ఖైదీలను కాల్చి చంపారు. కరోనా మహమ్మారి కాలంలో కొంతమంది ఖైదీలను విడుదల చేశారు కూడా. పదే పదే జైళ్లలో హింస చెలరేగుతున్న నేపథ్యంలో ఖైదీలపట్ల విధానాన్ని మరింత మానవీయంగా మారుస్తామని, ఖైదీల గౌరవాన్ని కాపాడతామని కొత్తగా ఎంపికైన దేశాధ్యక్షుడు గుస్టావో పెట్రో పేర్కొన్నారు.



Next Story

Most Viewed