ఈ సీజన్‌లో ఏ రాష్ట్రం నుంచి ఆ రైస్ కొనం: ఎఫ్‌సీఐ రీజినల్ మేనేజర్ దీపక్ శర్మ

by Disha Web Desk 19 |
ఈ సీజన్‌లో ఏ రాష్ట్రం నుంచి ఆ రైస్ కొనం: ఎఫ్‌సీఐ రీజినల్ మేనేజర్ దీపక్ శర్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత యాసంగి సీజన్‌కు ఏ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోవడంలేదని, తెలంగాణ నుంచి సైతం కొనే ప్రసక్తే లేదని హైదరాబాద్‌లోని ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) రీజినల్ మేనేజర్ దీపక్ శర్మ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిరసన దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం తర్వాత ఎఫ్‌సీఐ తాజా వైఖరిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ నుంచి మాత్రమే కాక ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ సీజన్‌కు బాయిల్డ్ రైస్‌ను కొనడంలేదని, కొనే ఉద్దేశం కూడా లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పటికే ఎఫ్‌సీఐ దగ్గర బాయిల్డ్ రైస్ దాదాపు 48 లక్షల టన్నుల మేర నిల్వలు ఉన్నాయని, అందువల్లనే అన్ని రాష్ట్రాలకూ ముందుగానే సమాచారం ఇచ్చి బాయిల్డ్ రైస్ సప్లై చేయవద్దనే అంశాన్ని నొక్కిచెప్పామని మీడియాకు వివరించారు.

పచ్చి బియ్యం(రా రైస్) ఎంతైనా కొంటామని, తెలంగాణ సహా ఎన్ని రాష్ట్రాలు సప్లై చేసినా తీసుకోడానికి ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉన్నదని దీపక్ శర్మ స్పష్టం చేశారు. రా రైస్ విషయంలో తెలంగాణ సహా ఏ రాష్ట్రానికీ ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి యాసంగి సీజన్‌కు పచ్చి బియ్యాన్ని ఎంత మోతాదులో సప్లై చేస్తారో వివరాలను తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రం సేకరించబోమని పేర్కొని గత రెండేళ్ళుగా తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రాల్లో పారాబాయిల్డ్ రైస్ ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. ఆ రాష్ట్రాల్లో సాగుబడి పెరిగినందున స్వయం సమృద్ధి సాధించినట్లు తెలిపారు.

తెలంగాణ విషయానికి వస్తే గతేడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 70.22 లక్షల టన్నుల మేర బాయిల్డ్ రైస్‌ను కొన్నామని, దీనికి రూ.13,402 కోట్లను కూడా చెల్లించామని, సుమారు 10.62 లక్షల మంది రైతులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉన్నదని, దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని, అందువల్లనే రాష్ట్రం చేస్తున్న ప్రత్యేక విజ్ఞప్తులకు అనుగుణంగా ఎక్కువ మోతాదులోనూ కొన్నామని వివరించారు. కానీ ఈసారి యాసంగి సీజన్‌కు మాత్రం ఏ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ సేకరించొద్దనే విధాన నిర్ణయం జరిగిందని, తెలంగాణ కూడా ఇందుకు సమ్మతించి ఒప్పందం కుదుర్చుకున్నదని, రాతపూర్వకంగానే ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఈసారి నేరుగా ధాన్యాన్ని కొనాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో అర్థం లేదని దీపక్ శర్మ స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ సేకరణ విషయంలో ఎఫ్‌సీఐ విధానంపై తెలంగాణ ప్రభుత్వానికీ కూడా పూర్తి వివరాలు తెలుసు అని గుర్తుచేశారు.



Next Story

Most Viewed