ఆ కంపెనీ విత్తనాలతో వందల ఎకరాల్లో నష్టపోయిన రైతులు.. న్యాయం కావాలంటూ..

by Manoj |
ఆ కంపెనీ విత్తనాలతో వందల ఎకరాల్లో నష్టపోయిన రైతులు.. న్యాయం కావాలంటూ..
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని కొందరు రైతులు మొక్కజొన్న పంట వేసి నష్ట పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 'అడ్వంట సీడ్ కంపెనీ'కి చెందిన సీడ్ వేశామని, మొదట్లో పంట బాగానే ఉన్నా.. క్రాసింగ్ స్థాయికి వచ్చేసరికి పంట పూర్తిగా నాసిరకంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ కంపెనీకి చెందిన ఆర్గనైజర్ ఎకరానికి రూ.30,000 పెట్టుబడి పెట్టారని.. కానీ తాము మళ్లీ ఎకరానికి రూ.1,00,000 పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు.

క్రాసింగ్ అవ్వలేదని, మొక్కజొన్న కంకులు మొత్తం గింజలు లేకుండా ఉన్నాయని, దీంతో దిగుబడి రాకుండా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట హార్వెస్టింగ్ చేస్తే ఎకరానికి రెండు టన్నులు కూడా అవ్వదని, సీడ్ కంపెనీ యజమానులు, ఆర్గనైజర్లు న్యాయం చేయాలని కోరారు. లచ్చాపురం గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో అడ్వంట కంపెనీకి చెందిన విత్తనాలను వేసినట్లు రైతలు తెలిపారు. ఆ వంద ఎకరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు.



అడ్వంట(advanta) సీడ్ కంపెనీ ఆర్గనైజర్లు ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరుకు దిగుబడి వస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుత పంట పరిస్థితి చూస్తుంటే ఎకరానికి రెండు టన్నుల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. సీడ్ క్రాసింగ్ అవ్వక మొక్కజొన్న పొత్తులు లేకుండా పోయాయి. సీడ్ కంపెనీ యజమానులు మాకు న్యాయం చేయాలి.

-సొంగ యేసుమణి, సీడు మొక్కజొన్న రైతు


విత్తనం మార్చడం వల్ల ఎకరానికి రూ.లక్ష నష్టపోయాం

ప్రముఖ సీడ్ కంపెనీ విత్తనం ఇవ్వమంటే.. అడ్వంట(advanta)విత్తనం ఇచ్చారు. లచ్చాపురం గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో ఈ సీడ్ అందించారు. అందరిదీ ఇదే పరిస్థితి. హార్వెస్టింగ్ చేసిన వారికి ఎకరానికి రెండు టన్నులు దిగుబడి వచ్చింది. ఒక ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాం.. కానీ దిగుబడి లేక నష్టపోతున్నాం.

-తోట చిన్న బల్లయ్య

దిగుబడి తగ్గితే కంపెనీతో మాట్లాడి న్యాయం చేస్తాం

లచ్చాపురం గ్రామంలో సీడ్ వేసిన వారికి హార్వెస్టింగ్ చేశాం. హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఒకవేళ పంట దిగుబడి తగ్గితే సీడ్ కంపెనీతో మాట్లాడి న్యాయం చేస్తాం. హార్వెస్టింగ్ చేయకుండా దిగుబడి రాలేదు అంటే ఎవరు ఏమి చేయలేరు.

-అడ్వంట సీడ్ కంపెనీ ఆర్గనైజర్



Next Story