భూమిని కబ్జా చేస్తున్న రైతులు.. వందల ఎకరాల లో కబ్జా..!

by Dishafeatures2 |
భూమిని కబ్జా చేస్తున్న రైతులు.. వందల ఎకరాల లో కబ్జా..!
X

దిశ, ఇందల్వాయి: రైతులకు పెట్టడమే తెలుసు.. లాక్కోవడం తెలియదని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇందల్వాయి గ్రామ రైతులు మాత్రం తమకు పెట్టడమే కాదు లాక్కోవడం కూడా వచ్చని నిరూపిస్తున్నారు. మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో ఉన్న ఇందల్వాయి పెద్ద చెరువు చుట్టుపక్కల గ్రామాల్లో కన్నా అతి పెద్దది. ఇది కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. అలాంటి ఈ చెరువు కబ్జాకు గురవుతోంది. గ్రామంలో ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరరిస్తుండడం గమనార్హం. కబ్జా చేసిన భూమికి పట్టాలు చేస్తున్న రెవెన్యూ శాఖ యంత్రాంగం తీరు పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిస్తే పట్టా ఇచ్చుడే.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. వారిపై కాసులు కురిపించడంతో గుట్టుచప్పుడు కాకుండా పట్టాలిచ్చేస్తున్నారని సమాచారం. శిఖం భూమికి పట్టా ఇవ్వవచ్చా అని గ్రామస్తులు రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ఇలాగే కొనసాగితే చివరికి మండలంలోనే అతి పెద్దదైన ఇందల్వాయి పెద్ద చెరువు చివరికి చిన్న కుంటలా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి చెరువు నుండి రామడుగు ప్రాజెక్టు వరకు నీరు వెళ్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. అలాంటి పెద్ద చెరువును చుట్టుపక్కల రైతులు కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ యంత్రాంగం తేరుకొని ఇందల్వాయి పెద్ద చెరువు యొక్క శిఖం భూమిని చుట్టు పక్కల రైతులు ఎవరైతే కబ్జా చేశారో.. వారి నుండి సర్వే చేయించి కాపాడాలని కోరుతున్నారు. అలాగే చెరువు చుట్టూ బౌండ్రీ తీయించి ఇతరులు మరోసారి కబ్జాకు పాల్పడకుండా హద్దులు వేయించి ఈ యొక్క పెద్ద చెరువును రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా గత 20 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే మరింత శిఖం భూమి తిరిగి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.


Next Story