డబుల్ 'దోపిడీ'.. పేదల ఇండ్ల పేరిట పెద్దల భోజ్యం

by Disha Web |
డబుల్ దోపిడీ.. పేదల ఇండ్ల పేరిట పెద్దల భోజ్యం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం.. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పేదలను ఊరిస్తున్న పథకం.. ఇందిరమ్మ ఇల్లు పిట్టగూడులా ఉన్నాయి.. బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి.. గొడ్డు గోద, బర్రె గొర్రె పెంచుకునేలా.. రెండు పడకల ఇండ్లు బ్రహ్మాండంగా కట్టించి తాళం చెవి చేతిలో పెడతాం.. సర్కారు రాక ముందు నుంచి.. కేసీఆర్ ఉపన్యాసాల్లో మారుమోగిన మాటలు.. ఈ హామీతో టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. అర్హులైన వారికి ఆ రెండు పడకల గదుల ఇల్లు మాత్రం ఇంకా కలగానే మిగిలింది.. పేదలకు లబ్ధి పక్కన పెడితే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కల్పతరువుగా మారింది.. ఇండ్లు తక్కువ.. లబ్దిదారులు ఎక్కువగా ఉండటంతో.. స్థలానికో రేటు, ఇంటికో రేటు చొప్పున అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 15 వేల ఇండ్ల వరకు మంజూరు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణం అంతంతగానే చేపట్టగా.. పూర్తయిన చోట టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందిన కాడికి దండుకుంటున్నారు. అక్రమంగా వసూళ్లు చేసి లబ్ది పొందుతున్నారు. ఈ పథకాన్ని టీఆర్ఎస్‌కు చెందిన వారు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో మాదిరిగా ఉపయోగించుకుంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ మండలం లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సంఖ్య కంటే లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో స్థానిక నాయకులు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.50 వేల నుంచి లక్ష వరకు ఒక్కొక్కరి వద్ద నుంచి వసూలు చేసుకున్నారు. నిర్మించిన ఇళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండగా.. ఇప్పటికే ఇళ్లు పూర్తయినప్పటికీ నెలల తరబడి వాటి కేటాయింపులు మాత్రం చేయట్లేదు. ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తే.. డబ్బులిచ్చిన వారందరూ గొడవ పెడతారేమోననే భయం అధికార పార్టీ నాయకులను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది..

బోథ్ నియోజకవర్గంలోని బండల్ నాగపూర్‌లో కొన్నేళ్ల క్రితం మోడల్ డబుల్ బెడ్రూం ఇండ్లు వందకుపైగా నిర్మించారు. వీటిని అర్హులకు కేటాయించగా.. సామూహిక గృహప్రవేశాలు పూర్తయ్యాయి. తలమడుగు మండలం సుంకిడి లో ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి భూమి కొన్నారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధి పేరిటా రిజిస్ట్రేషన్ చేయగా.. ఆయన కొన్ని ప్లాట్లు చేసుకుని విక్రయం చేశారు. ప్లాటు సైజు తగ్గించి ఇస్తామటంతో వివాదానికి దారి తీసింది. బోథ్ నియోజకవర్గంలో పలు చోట్ల ఇల్లు నిర్మాణ దశలో ఉండగా.. నత్తనడకన సాగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ వాటిని అర్హులకు పంపిణీ చేయట్లేదు. ఇందుకు డబ్బుల వసూలు, తక్కువ ఇండ్లు ఎక్కువ మంది లబ్దిదారులే కారణమటా.

ముధోల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇళ్లు ఇవ్వడం లేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారటా. భైంసాలోని అమలాపురం గుట్ట వద్ద 416 ఇండ్లు పూర్తవగా.. పంపిణీ చేయలేదు. అందులోనే గుండేగాం నిర్వాసితులు తాత్కాలికంగా ఉంటున్నారు. డిగ్రీ కాలేజీ సమీపంలో 600 ఇండ్లు నిర్మాణంలో ఉండగా.. పూర్తి కాలేదు. కుబీర్ మండలం మాలేగాం, సాంగ్వి గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆందోళన చేశారు. ఈ రెండు చోట్ల ఇండ్ల నిర్మాణం నిలిచిపోయింది. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు డబుల్ ఇండ్ల పేరిట రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేయగా.. స్థానికులను తమ వెంట ఏళ్ల తరబడి తిప్పుకోవటం కొసమెరుపు.

నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో 1800 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినా.. వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికలకు ముందు వీటి నిర్మాణ పనులు ప్రారంభించగా.. అర్హులకు కేటాయించటంలో తీవ్ర జాప్యమవుతోంది. అనంతపేట్, బంగళ్పేటలలో ఇళ్లు పంపిణీ చేయటం లేదు. దశాబ్దాలుగా నిర్మల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల కేటాయింపు చేయకుండా.. అర్హులను గుర్తించకుండా జాప్యమవుతోంది. అసలే ఇండ్ల నిర్మాణం చేపట్టకపోగా.. పూర్తయిన చోట పంపిణీ చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఇండ్ల సంఖ్య కంటే లబ్దదారులు ఎక్కువగా ఉండటం.. అప్పటికే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో.. ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇండ్లు పంచితే రాని వారు ఆందోళనలకు దిగుతారని.. ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లపై హేళనగా మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.. తాజాగా డబుల్ ఇండ్ల విషయంలో చేతులెత్తేశారు. పేదలకు సొంతిళ్లు అనేది కలగానే మిగిలి పోయేలా ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed