కేసీఆర్‌కు విజన్​లేదు.. సినిమా వాళ్ల కోసమే ఆ జీవో రద్దు!

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు విజన్​లేదు.. సినిమా వాళ్ల కోసమే ఆ జీవో రద్దు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్​విజనరీ అని చెప్పుకోవడమే తప్ప ఆయనకు విజన్ లేదని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్​జిందాబాద్​ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 111 జీవో రద్దు, పర్యవసనాలపై ఆదివారం సెమినార్​నిర్వహించారు. తొలుత ఆయన 111 జీవో రద్దు, పర్యవసానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ జీవో రద్దు రియల్టర్ల కోసం, ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న విధ్వంసమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్​అనుచరుల భూముల ధరలు పెంచేందుకే 111 జీవో రద్దు నిర్ణయాన్ని తెరపైకి తెచ్చాడని అన్నారు. రియల్​ఎస్టేట్​వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు, ఆంధ్రులు, సినిమా వాళ్ల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఈ జీవో రద్దుతో ఏమాత్రం లబ్ధి లేదని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ చాలా చెరువులను నాశనం చేస్తోందని ఆరోపించారు. చెరువులు మన సంస్కృతికి చిహ్నాలని, అలాంటి చిహ్నాలను నాశనం చేస్తూ డబ్బు చేసుకుంటున్నారని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ విచిత్రమైన హామీలు ఇస్తాడని చురకలంటించారు. భూమికి ధరలు పెంచి హామీ ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని విమర్శలు చేశారు. భూముల ధరలు పెరగడమే అభివృద్ధా? అని నర్సింహారెడ్డి ప్రశ్నించారు.

జీవో 111 మొట్టమొదటిసారి వైయోలేషన్ చేసింది చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. జంట జలాశయాలకు సమీపాన ఉన్న 84 గ్రామాల ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటో ఎవరూ చెప్పరని మండిపడ్డారు. జలాశయాల పరిరక్షణకు నిజాం సమకూర్చిన 5 వేల ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లుగా దొంతి నర్సింహారెడ్డి వెల్లడించారు. 111జీవోను సీఎం మాటల్లా గాలిలో వచ్చినవి కాదని, చర్చలు, వాదోపవాదాలు జరిగాకే ఆ జీవోను తీసుకొచ్చారని చెప్పారు. 111 జీవోను ఎత్తేస్తే మంచినీరు కూడా దొరకని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. గోదావరిలో నీటి కొరత పెరిగేకొద్దీ భవిష్యత్‌లో కొట్లాటలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి మాటల్లో గోల్​మాల్ తప్ప వాస్తవం లేదని తీవ్రంగా మండిపడ్డారు. హెచ్ఎండీఏ ఒక రియల్​ఎస్టేట్​బ్రోకర్ సంస్థ అని ఆయన విమర్శలు చేశారు. జంట జలాశయాలను కాపాడేందుకు రేగ్యులేటరీ సిస్టం తీసుకురావాలని, భూములపై సర్వే కూడా నిర్వహించాలని సూచించారు.

హైదరాబాద్​జిందాబాద్​అధ్యక్షుడు ఎన్ అంజయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్​జలాశయాల పరిరక్షణకే 111 జీవోను తీసుకొచ్చారని, అయితే ఇప్పుడు ఆ జీవోను ఎవరి కోసం రద్దు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 111 జీవో రద్దుపై పెద్దోళ్లు మాత్రమే సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పాలకుల చేతికి ఆ భూములన్నీ వెళ్లిపోయాయని అంజయ్య ఆరోపించారు. ఈ జీవో రద్దుపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు.

పర్యావరణవేత్త సుబ్బారావు మాట్లాడుతూ.. జీవో 111 లో ఉన్న అంశాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపణలు చేశారు. కనీసం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని కూడా వేయకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని విమర్శలు చేశారు. భూ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సుబ్బారావు డిమాండ్​చేశారు. మూసీ నదిని కూడా కాపాడుకోలేని నిస్సహాయతలో ప్రభుత్వాలుండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జంట జలాశయాలను కాపాడుకునేందుకు అందరూ ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. 2017లో 22 చెరువుల అలుగులు పగులగొట్టారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని సుబ్బారావు డిమాండ్​చేశారు. గుర్రపు డెక్క తొలగింపు పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయల దందాలు చేస్తోందని విమర్శలు చేశారు. ఈ సెమినార్‌లో ఇండిపెండెంట్ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి, పాశం యాదగిరి తదితరులు హాజరయ్యారు.



Next Story

Most Viewed