న్యాయం జరిగేలా లేదని గ్రహించే ఇలా నిరసన చేస్తున్నా

by Dishanational1 |
న్యాయం జరిగేలా లేదని గ్రహించే ఇలా నిరసన చేస్తున్నా
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని జన్మభూమినగర్ లో గల సర్వే నెంబర్ 416లోని 205 గజాల విస్తీర్ణం గల తన భూమిని కబ్జాదారులు కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలంటూ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వల్లభనేని బాబురావు అనే వృద్ధుడు నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తన గొడును వెల్లబోసుకున్నాడు. 415 సర్వే నెంబర్ లో తమ పర్మీషన్ ను చూపిస్తూ 416లోని తమ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని, ఇదేమిటని వారిని ప్రశ్నిస్తే ఆ భూమి తమదేనని, తమ వద్ద పత్రాలు ఉన్నాయని చూపిస్తున్నారని, 1995లోనే తాను భూమి కొనుగోలు చేయడం జరిగిందని, కబ్జాదారులు తప్పుడు పత్రాలను సృష్టించుకుని తన భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మున్సిపాలిటీ నుండి పర్మీషన్ పొంది అక్రమంగా నిర్మాణాలను కూడా చేస్తున్నారని, ఆ నిర్మాణాలను ఆపాలని వేడుకున్నందుకు తనపై దాడికి దిగడంతోపాటు తనపైనే తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నాడు. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు చాలా సార్లు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని, అయినా కూడా తనకు న్యాయం జరిగేలా లేదని గ్రహించి ఇలా నిరసనకు దిగుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి పూర్తి విచారణ జరిపించి తన భూమిని తనకు ఇప్పించేలా కృషి చేయాలని ఆయన వేడుకున్నాడు.


Next Story

Most Viewed